05-04-2025 08:44:16 PM
హత్నూర: ఈతకు వెళ్లి నీట మునిగి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం... బోర్పట్ల గ్రామంలో గత మూడు రోజులుగా జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు గ్రామానికి చెందిన డబ్బు చంద్రమౌళి అల్లుడు ప్రేమ్ కుమార్ (36), సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం వీరభద్ర పల్లి గ్రామం కుటుంబ సభ్యులతో జాతరకు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం శివారులోని భీముని చెరువులో ఈత కొట్టడానికి వెళ్ళాడు.
చెరువులో ఈత కొడుతూ కొద్దిసేపటి తర్వాత ఊపిరి ఆడక పోవడంతో నీట మునిగిపోయాడు. వారి కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో డప్పు నవీన్ (26) ప్రేమ్ కుమార్ ను కాపాడడానికి నీటిలోకి ఈత కొడుతూ వెళ్ళాడు అతను ఈత కొడుతుండగా నీటిలో ఊపిరి ఆడక నీట మునిగాడు. జరిగిన ఘటన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ దొరకలేదు. మరుసటి రోజు శనివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ప్రేమ్ కుమార్, డప్పు నవీన్ మృతదేహాలు వెలికి తీశారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సుభాష్ పేర్కొన్నారు.