నిర్మల్ జిల్లాలో బకాయిలు
ఆవేదనలో విద్యార్థులు
ఆందోళనలో విద్యాసంస్థలు
ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు
నిర్మల్, జూన్ 29 (విజయక్రాంతి) : ప్రభుత్వాలు ఏవైనా విద్యార్థులకు చేయూత నందించాలి. ఆర్థిక వనరులు, ఇతర మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. అయితే, పాలకుల నిర్లక్ష్యంతో రెండేండ్లుగా స్కాలర్‌షిప్‌లు విడుదల కాక విద్యార్థులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. నిర్మల్ జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉపకార వేతనాలు సుమారు రూ.31.76 కోట్ల బకాయిలున్నట్లు అధికారులు తెలిపారు. 2022 2023 విద్యా సంవత్సరానికి సుమారు 31వేల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మల్ జిల్లాలో ఇంటర్, డిగ్రీ, ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
రెండేళ్ల నుంచి ఎదురుచూపులే..
బీసీ సంక్షేమశాఖ ద్వారా అందించే ఉపకార వేతనాల కోసం విద్యార్థులు రెండేండ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇంటర్ విద్యార్థులకు రూ.1800, డిగ్రీ విద్యార్థులకు రూ.13500, టెక్నికల్ కోర్సు విద్యార్థులకు రూ.13500 చొప్పున ఉపకార వేతనాలను అందించాల్సి ఉంది. అయితే ప్రైవేటు విద్యాసంస్థలు స్కాలర్‌షిప్‌లు మినహాయించి, మిగతా ఫీజు వసూలు చేస్తుంటాయి. రెండేళ్లుగా స్కాలర్‌షిప్‌లు బకాయి ఉండడంతో ఇప్పుడు ఆ డబ్బు కోసం విద్యార్థులపై ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. చదువు పూర్తయిన విద్యార్థులకు స్కాలర్‌షిప్పులకు, సర్టిఫికెట్లకు ముడిపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పేరెంట్స్ ఆవేదన చెందుతున్నారు.
నిర్మల్ జిల్లాలో నిర్మల్, బైంసా, ఖానాపూర్, ముధోల్ తదితర ప్రాంతాల్లో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఉపకార వేతనాలు విడుదల చేయాలని కలెక్టర్ కు, బీసీ సంక్షేమశాఖ అధికారులకు వినతిపత్రాలు అందిం చినా ఇప్పటి వరకు ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు చదువు చెప్పేందుకు అధ్యాపకులకు వేతనాలు, అద్దె భవనాల నిర్వహణ, కరెంట్ బిల్లులు, ఇతర అవసరాలకు అప్పులు తెచ్చి కళాశాలలు నిర్వహిస్తే ఆర్థికభారం తమపై తడిసి మోపెడు అవుతుందని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉపకార వేతనాలను విడుదల చేయాలని కోరుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నం
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రెండేండ్ల నుంచి ఉపకార వేతనాలు రావడం లేదు. విద్యా సంస్థల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది. వేతనాలు, అద్దె, ఇతరత్రా ఖర్చులకు ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి.
హ్ అఖిలేశ్, వశిష్ఠ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
ప్రభుత్వానికి నివేదించాం
బీసీ సంక్షేమ పరిధిలో స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని ప్రభుత్వానికి విన్నవించాం. జిల్లాలో రూ.31.76 కోట్లు పెండింగ్ ఉంది. ఉపకార వేతనాల కోసం విద్యార్థులు తరచూ కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు. నిధులు విడుదల కాగానే వారి ఖాతాల్లో జమ చేస్తాం.
రాజేశ్వర్ గౌడ్, జిల్లా అధికారి