calender_icon.png 23 December, 2024 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతం పాలక మండలి సభ్యులుగా ఇద్దరు మహిళ నాయకులు

23-12-2024 07:38:52 PM

స్వాగతించిన గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్...

పటాన్ చెరు: గీతం యూనివర్సిటీ పాలక మండలి సభ్యులుగా జస్టిస్ కె.విజయలక్ష్మి, పద్మజ చుండూరు చేరినట్టు గీతం అధ్యక్షుడు ఎం.శ్రీ భరత్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. వీరి చేరికతో విశ్వవిద్యాలయం యొక్క నిబద్ధత మరింత మెరుగవుతుందన్నారు. జస్టిస్ కె.విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టులలో న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవంతో గీతం పాలక మండలిలో చేరారు. ఆమె విశిష్టమైన కెరీర్ లో రెండు రాష్ట్రాలలో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. మధ్యవర్తిత్వ వ్యవహారాలలో నిపుణురాలిగా ప్రసిద్ధి చెందిన జస్టిస్ విజయలక్ష్మి తన అనుభవంతో విశ్వవిద్యాలయాన్ని మరింత మెరుగుపరుస్తారని ఆయన అన్నారు.

ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణురాలు పద్మజ చుండూరు మనదేశంతో పాటు అమెరికాలో కూడా ఆర్థిక సేవల రంగంలో 37 ఏళ్లకు పైగా విస్తృత అనుభవం  ఉందన్నారు. ఎన్ఎస్ డీఎల్, ఇండియన్ బ్యాంక్ వంటి గౌరవప్రదమైన సంస్థలలో క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటు, ఆర్థిక వ్యవహారాలలో వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో కీలక భూమిక పోషించారన్నారు. డిజిటల్ బ్యాంకింగ్, కార్పొరేట్ గవర్నెన్స్, నాయకత్వంలో ఆమె లోతైన నైపుణ్యం గీతంకు అమూల్యమైనదన్నారు. 

జస్టిస్ విజయలక్ష్మి, పద్మజలను పాలక మండలిలో చేర్చుకోవడం గీతం కమ్యూనిటీకి ముఖ్యమైన మైలురాయి అన్నారు. వారి నాయకత్వం విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిని వారి రంగాలలో రాణించేలా ప్రేరేపిస్తాయని భావిస్తున్నామన్నారు. గవర్నింగ్ బాడీ సమావేశంలో కొత్త సభ్యులకు ఎం.శ్రీభరత్ ఘనస్వాగతం పలికారు. జస్టిస్ విజయలక్ష్మి, పద్మజలు బోర్డులో ఉండటం గౌరవంగా భావిస్తున్నాం. వారి చేరిక మా విశ్వవిద్యాలయం యొక్క నిర్ణయాత్మక మార్పులకు, ప్రపంచ స్థాయి విద్యను అందించే మా మిషన్ కు దోహదం చేస్తాయని అని అన్నారు. విభిన్న దృక్కోణాలకు విలువనిచ్చే సమ్మిళిత వాతావరణాన్ని గీతం పెంపొందిస్తున్నదన్నారు.