- వేర్వేరుగా ప్లాట్లు విక్రయించిన రెండు రియల్ ఎస్టేట్ సంస్థలు
- ఓ బాధితుడి ఫిర్యాదుతో ఇద్దరి అరెస్ట్
శేరిలింగంపల్లి, నవంబర్ 1: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. దానిని ఆసరాగా చేసుకొని జనాలకు కుచ్చుటోపి పెడుతున్నాయి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు. ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ సినీ తారలతో జనాలను ఆకర్షిస్తున్నారు.
తమ అభిమాన తారలే అంత నమ్మ కంగా ప్రచారం చేస్తుండడంతో జనాలు గుడ్డిగా నమ్మేసి మోసపోతున్నారు. ఇలాంటి మోసమే తాజాగా వెలుగులోకి వచ్చింది. సినీ నటుడు మహేష్‌బాబు ప్రచారకర్తగా ఉన్న సాయిసూర్య డెవలపర్స్ సంస్థ జనాలను నిండా ముంచింది. పోలీసుల కథనం ప్రకారం..
సాయిసూర్య డెవలపర్స్ ఎండీ కంచర్ల సతీశ్ చంద్రగుప్తా, భాగ్యనగర్ ప్రాపర్టీస్ డైరెక్టర్ నరేందర్ సురానాలు వట్టినాగు లపల్లిలోని ఒకే ల్యాండ్‌లో సాయితులసి ఎన్క్లేవ్ 4, షణ్ముఖ నివాస్ పేర్లతో సరైన అనుమతులు లేకుండానే రెండు లేఅవుట్లు వేశారు. సాయిసూర్య డెవలపర్స్ ప్రచాకర్తగా సినీ నటుడు మహేష్‌బాబు వ్యవహరించారు.
పై రెండు రియల్ ఎస్టేట్ సంస్థలు ఎవరికి వారుగా అమ్మకాలు సాగించి వినియోగదారుల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారు. అయితే, సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు ఒకటే సర్వే నంబర్లోని భూమిలో రెండు వేర్వేరు పేర్లతో వెంచర్లు వేసి మోసం చేస్తున్నట్లు గుర్తించిన గోపాల్‌రెడ్డి అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఈవోడబ్ల్యూ పోలీసులు కంచర్ల సతీశ్ చంద్రగుప్తా, నరేందర్ సురానాను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.