- పారాలింపిక్స్ అథ్లెట్లకు ఆల్ ది బెస్ట్
- అథ్లెట్ల బృందంతో ప్రధాని మోదీ భేటీ
- హాకీ స్టిక్‌ను బహూకరించిన హర్మన్ సేన
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం భారత్ కల అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2036లో జరగనున్న ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉందని.. దీనికి సంబంధించిన సన్నాహాకాలు పూర్తి చేసే పనిలో ఉన్నట్లు మోదీ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ప్రధాని మోదీ ఢిల్లీలోని ప్రఖ్యాత ఎర్రకోటపై జాతీ య జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చిన అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా పారాలింపిక్స్‌కు వెళ్లనున్న భారత అథ్లెట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ప్రధాని మాట్లాడుతూ.. ‘ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం భారత్ కల. 2036 ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ఇప్పటికే మొదలుపెట్టాం. గతంలో మన దేశంలో ప్రతిష్ఠాత్మక జీ20 సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించాం. భారీ ఈవెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించగలమని నిరూపించాం. ఇక పారిస్ ఒలిం పిక్స్‌లో పతకాలు సాధించి భారత జెండాను రెపరెపలాడించిన మన క్రీడాకారులకు అభినందనలు. పతకాలతో దేశ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేశారు. 2028 ఒలింపిక్స్ వరకు పతకాల సంఖ్య రెట్టింపు అవ్వాలని ఆశిద్దాం. మరికొన్ని రోజుల్లో పారాలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు మన అథ్లెట్లు పారిస్ వెళ్తున్నారు. వారికి ఆల్ ది బెస్ట్’ అని వెల్లడించారు.
అథ్లెట్ల బృందంతో ప్రధాని భేటీ
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పారిస్‌కు వెళ్లిన భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని మోదీ గురువారం సాయంత్రం తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరు పతకాలు వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లను వేదికపైకి పిలిచిన మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పారిస్ క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు ప్రధాని మోదీకి సంతకం చేసిన హాకీ స్టిక్‌తో పాటు జెర్సీని బహుకరించింది.
అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన గోల్ కీపర్ శ్రీజేశ్‌కు మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ హాకీ జట్టుతో ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. ఇక రెజ్లింగ్‌లో దేశానికి పతకం తీసుకొచ్చిన అమన్ షెరావత్‌తో ముచ్చటించిన మోదీ.. మన దేశ కుస్తీ పట్టును నిలబెట్టావని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ, భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష, మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంవోసీ) ప్రతినిధి రక్షా ఖడ్సే తదితరులు పాల్గొన్నారు.
ఈ పిస్టల్‌తోనే పతకం తెచ్చా
ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన భారత షూటర్ మనూ బాకర్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మనూ ఒలింపిక్స్‌లో పతకం కొల్లగొట్టిన పిస్టల్‌ను ప్రధాని మోదీకి చూపించింది. ఈ పిస్టల్‌తోనే మన దేశానికి రెండు పతకాలు తీసుకొచ్చినట్లు వెల్లడించింది. అనంతరం తాను సాధించిన రెండు మెడల్స్‌తో మనూ ప్రధాని మోదీతో ఫోటోకు ఫోజు ఇచ్చింది. ఇక మిక్సడ్ టీమ్ విభాగంలో మనూతో కలిసి పతకం గెలిచిన సరబ్‌జోత్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు.
అనంతరం 50 మీ రైఫిల్ పొజిషన్‌లో కాంస్యం సాధించిన స్వప్నిల్ కుసాలేతో ఫోటో దిగిన మోదీ.. ఈ విభాగంలో దేశానికి తొలి పతకం తీసుకొచ్చిన స్వప్నిల్‌ను చూస్తుంటే గర్వంగా ఉందని పేర్కొన్నారు. రజతం సాధించిన నీరజ్ చోప్రా స్వదేశానికి రాకపోవడంతో కార్యక్రమానికి దూర మయ్యాడు.