calender_icon.png 27 February, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోనేరులో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

27-02-2025 01:48:23 AM

ఒకరు సేఫ్.. మరొకరి కోసం కోనేటి నీటిని తోడి గాలింపు

నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోనేరులో స్నానం చేస్తున్న గురుకుల విద్యార్థులు ప్రమాదవశాత్తు కోనేరులో గల్లంతైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం గుండాల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని అంబ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా మహాశివరాత్రి సెలవు దినం కావడంతో జేపీ తండాలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న ఐదు మంది విద్యార్థులు స్వామివారి దర్శనం కోసం హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం మన్ననూరు గ్రామానికి చెందిన పెరుమల్ల ఓమేష్(17) తో పాటు సందీప్, బాలకిషన్, ఆనంద్, చరణ్ అనే మరో నలుగురు పాఠశాల గోడ దూకి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. అక్కడే ఉన్న సప్త కోనేరులో స్నానం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు కాలుజారి కోనేరులో పడిపోయారు. 

వెంటనే స్థానికులు ఓ విద్యార్థిని బయటికి తీయగా ఓమేష్(17) అనే విద్యార్థి కోనేరులో గల్లంతయ్యాడు. దీంతో స్థానికులుఫైర్,  పోలీసులకు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో గల్లంతు కాక సాయంత్రం వరకు కోనేటిలోని నీటినంత తోడి ఆచూకీ కోసం గాలించారు.  ఇప్పటికి విద్యార్థి ఆచూకీ లభించకపోవడంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వారికి భరోసా కల్పించారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.