- నేడు సెమీస్‌లో జర్మనీతో భారత్ ఢీ
- కీలకంగా మారనున్న శ్రీజేష్, హర్మన్‌ప్రీత్
పారిస్: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 44 ఏళ్ల స్వర్ణం కల సాకారమయ్యేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. నేడు హర్మన్ సారథ్యంలోని టీమిండియా సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ జర్మనీతో అమీతుమీకి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే గురువారం భారత్ పసిడి పోరుకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. కాగా క్వార్టర్స్‌లో పటిష్ట ఇంగ్లండ్ మీద గెలిచి హర్మన్ సేన ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. క్వార్టర్స్ పోరులో రెడ్ కార్డుతో మైదానం వీడిన డిఫెండర్ అమిత్ రోహిదాస్ సెమీస్ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించారు.
దీంతో అతడి స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తికరం. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్ చేస్తూనే అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. ఇక ఒలింపిక్స్ తనకు చివరి అంతర్జాతీయ టోర్నీ అని ప్రకటించిన గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ మరోసారి కీలకం కానున్నాడు. బ్రిటన్‌తో మ్యాచ్‌లో ప్రత్యర్థి అటాకింగ్ గేమ్‌ను సమర్థంగా అడ్డుకొని విజయంలో కీలకపాత్ర పోషించిన శ్రీజేష్ రియల్ హీరో అనిపించుకున్నాడు. జర్మనీతో మ్యాచ్‌లోనూ అదే తరహ ప్రదర్శన ఇస్తే భారత్ ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత్ ఈసారి పసిడి నెగ్గాలనే పట్టుదలతో ఉంది. ఒలింపిక్స్‌లో స్వర్ణ యుగం చూసిన భారత హాకీ జట్టు ఆఖరిసారి 1980 మాస్కో ఒలింపిక్స్‌లో 8వ పసిడి పతకం గెలిచింది. మరో సెమీస్‌లో నెదర్లాండ్స్‌తో స్పెయిన్ అమీతుమీ తేల్చుకోనుంది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు తప్పకుండా స్వర్ణం గెలుస్తుందని పాకిస్తాన్ హాకీ లెజెండ్ హసన్ సర్దార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 44 సంవత్సరాలుగా ఒలింపిక్ స్వర్ణం కోసం నిరీక్షిస్తున్న భారత ఎదురుచూపులకు పారిస్ ఒలింపిక్స్ తెరదించుతుందని ఆయన జోస్యం చెప్పాడు.