21-02-2025 12:00:00 AM
ఖమ్మం, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) :- ఇంటి బయట ఆడుకుంటున్న పన్నెండు ఏళ్ల బాలికను మాయమాటలతో కిడ్నాప్ చేసి లైంగికదాడికి ఒడిగట్టిన ఇద్దరు నిందితులకు జీవితకాల కఠిన కారాగార శిక్షతోపాటు ఒక్కొక్కరికి రెండు లక్షల పది వేల రూపాయలు జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి కె.ఉమాదేవి గురువారం తీర్పు వెల్లడించారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2021 ఫిబ్రవరి 7 న ఇంటి బయట అడుకుంటున్న బాలిక వద్దకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు మాయమాటలతో బలవంతంగా మోటార్ సైకిల్ పై తీసుకెళ్లి నగర శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ లో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన అనంతరం విచారణ, సాక్ష్యాధారాల సేకరణ వేగవంతంగా పూర్తిచేసి పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
కేసు విచారించిన జడ్జి, బాలిక కిడ్నాప్ లైంగికదాడికి పాల్పడిన ఖమ్మం రమణగుట్ట కు చెందిన ఆటో డ్రైవర్, ఏ 1 నిందుతుడు కాలేపల్లి సంపత్ కి, అతనికి సహకరించిన ఏ 2 నిందుతుడు పసువుల నవీన్ లకు జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రెండు లక్షల పది వేల రూపాయలు జరిమానాలు విధించారు.నింది తులు నేరం నుండి తప్పించుకోకుండా శిక్ష పడేలా చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఏ.శంకర్, ఇన్స్‌పెక్టర్ వెంకన్న బాబు, (ప్రస్తుతం డిఎస్పీ ఇంటిలిజెన్స్) ఇన్స్‌పెక్టర్ భానుప్రకాశ్, కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు శ్రీనివాస్ రావు, నాగేశ్వరరావును పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. భవిష్యత్తులో కేసుల నుండి నిందితులు తప్పించుకోకుండా ఇదే స్పూర్తితో ముందుకు వెళ్లాలని అకాంక్షించారు