calender_icon.png 8 January, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు పోలీసుల బలవన్మరణం

30-12-2024 02:35:33 AM

* కుటుంబ కలహాలతో ఒకరు.. అప్పుల బాధతో మరొకరు?

* కొల్చారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉరేసుకుని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య

*  సిద్దిపేటలో భార్య, పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్

మెదక్/సిద్దిపేట, డిసెంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆదివారం జరిగిన ఇద్దరు పోలీసులు ఆత్మహత్య ఘటనలు సంచలనం రేపగా.. పోలీసు శాఖను కలవరంలోకి నెట్టాయి. సిద్దిపేటలో అప్పుల బాధతో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోగా.. కుటుంబ కలహాలతో మెదక్ జిల్లా కొల్చారంలో హెడ్‌కానిస్టేబుల్ ఆత్మచేసుకున్నాడు.

కొల్చారం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచే స్తున్న సాయికుమార్  ఆదివారం ఉద యం పోలీస్ స్టేషన్ ఆవరణలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూ రు జిల్లాకు చెందిన సాయికుమార్‌కు సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన లక్ష్మితో వివాహమైంది. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు.

రెండేళ్ల క్రితం బదిలీపై కొల్చారం పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. సాయికుమార్ వడ్డీ వ్యాపారం చేసేవాడని, నర్సాపూర్‌లో ఓ మహిళకు వడ్డీకి అప్పు ఇచ్చాడని తెలుస్తోంది. వారిమధ్య సాన్నిహిత్యం పెరిగిందని, ఈ విషయం కుటుంబీకులకు తెలియడంతో కలహాలు మొదలైనట్లు సమాచారం.

సదరు మహిళకు చెందిన వ్యక్తులు సాయికుమార్‌ను డబ్బులు ఇవ్వాలని, లేదంటే జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించినట్టు సమాచారం. దీంతో కుటుంబ కలహాలు నెలకొనడంతో మనస్థాపానికి గురైన సాయికుమార్.. ఆదివారం పోలీస్ స్టేషన్ ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నది. 

పిల్లలకు విషమిచ్చి, ఉరేసుకున్న కానిస్టేబుల్ 

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బండారి బాలకిషన్(34) సిరిసిల్ల 17వ బెటాలియన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహి  ఇటీవలే సిద్దిపేటలో ఇల్లు కొని, భార్య మానస, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. శనివారం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన బాలకిషన్ ఆందోళనతో కనిపించాడు.

రాత్రి 11 గంటల సమయంలో భార్యతో మాట్లాడుతూ సుమారు రూ.25 లక్షల అప్పు అయిందని, అవి తీర్చడానికి తనకు వచ్చే జీతం సరిపోదని భార్యకు వివరించాడు. అప్పులు తీర్చడం సాధ్యం కాదని కుటుంబ సభ్యులందరం ప్రాణాలు వదలడమే తప్ప మరో మార్గం లేదంటూ భార్యతో వాదించాడు. అంతలోనే తనకు చాయ్ తాగాలనిపిస్తుందని భార్యను అడిగాడు.

చాయ్ తీసుకురాగానే నాలుగు గ్లాసులలో విషం కలిపి భార్య, పిల్లలకు ఇచ్చి అతడు కూడా తాగాడు. తెల్లవారుజామున అందరికీ మెలకువ రావడంతో బాలకిషన్ గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. బాలకిషన్ అంతగా అప్పులు చేయాల్సిన కారణమేంటనేది తెలియడంలేదు. ఆన్‌లైన్ ద్వారా బెట్టింగులలో డబ్బులు పోగొట్టుకుని అప్పులు చేశాడని తెలుస్తోంది.