న్యూఢిల్లీ, జూలై 23: మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)కి 2024 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ. 1.68 లక్షల కోట్ల నిధులను కేటాయించారు. ఇంత కు ముందు ప్రవేశపెట్టిన ఎన్నికల బడ్జెట్‌లో కూడా ఇంతే మొత్తం లో కేటాయించారు. దేశంలో ఉన్న హైవేల కోసం రూ. 2.78 లక్షల కోట్లను కేటాయించారు. 2023 బడ్జెట్‌లో రహదారులకు రూ. 2.70 లక్షల కోట్లు కేటాయించగా.. తర్వాత రూ. 2.76 లక్షల కోట్లకు అంచనాలను సవరించారు. ఎన్‌హెచ్‌ఏఐ దేశంలోని జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ చూసుకుంటుంది. 2023 13,800 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించుకోగా.. 12,349 కిలోమీటర్ల మేర నిర్మించింది. ఇక 2023 ఆర్థిక సంవత్సరంలో 10,993 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించారు.