calender_icon.png 12 January, 2025 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రియల్టీలోకి 2.52 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

04-07-2024 01:40:31 AM

ముంబై, జూలై 3: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్6 త్రైమాసికంలో దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు 20 శాతం వృద్ధితో 2.52 బిలియన్ డాలర్లకు చేరినట్టు రియల్టీ కన్సల్టెన్సీ కొలియర్స్ ఇండియా తెలిపింది. ఈ సంస్థ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రియల్ ఎస్టేట్ రంగంలోకి తొలి త్రైమాసికంలో 2,528.5 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. గత ఏడాది ఇదేకాలంలో వచ్చిన 2,106.4 మిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి 20 శాతం అధికం.

రెసిడెన్షియల్ ఆస్తుల్లోకి పెట్టుబడులు భారీగా 72.3 మిలియన్ డాలర్ల నుంచి 543.5 మిలియన్ డాలర్లకు పెరగ్గా, ఆఫీస్ అసెట్స్‌లోకి తరలివచ్చిన పెట్టుబడులు 1,900.2 మిలియన్ డాలర్ల నుంచి 83 శాతం క్షీణించి 329.6 మిలియన్ డాలర్లకు తగ్గినట్టు కొలియర్స్ వివరించింది. ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్ ప్రాజెక్టుల్లోకి సంస్థాగత పెట్టుబడులు భారీగా 11 రెట్లు పెరిగి 133.9 మిలియన్ డాలర్ల నుంచి 1,533.1 మిలియన్ డాలర్లకు పెరిగాయన్నది.

దేశీయ రియల్టీలోకి వచ్చిన పెట్టుబడుల్లో అధికంగా 81 శాతం వాటా విదేశీ ఇన్వెస్టర్లదేనని, ఈ ఏడాది ఏప్రిల్‌జూన్ త్రైమాసికంలో ప్రధానంగా యూఎస్, యూఏఈ నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగిందని తెలిపింది. దేశీయ ఇన్వెస్టర్లు 0.5 బిలియన్ డాలర్లు ఈ రంగంలో ఇన్వెస్ట్ చేసినట్టు వెల్లడించింది. బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్‌లు 23 శాతం పెట్టుబడుల్ని ఆకర్షించాయి.