సోలార్ ప్లాంట్ కంచె లోపలికి వెళ్లే ప్రయత్నం లో విద్యుత్ షాక్
మిడ్జిల్ మండల పరిధిలోని బోయిన్పల్లి లో గల ప్రగతి సోలార్ ప్లాంట్ లో ఘటన
జడ్చర్ల: సోలార్ ప్లాంట్ లో విత్ కేబుల్ దొంగతనానికి వెళ్లి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందిన ఘటన మంగళవారం అర్ధరాత్రి మిడ్జిల్ మండలంలో చోటుచేసుకుంది. సోలార్ ప్లాంట్ మొదటి కంచె దాటి రెండో కంచె దాటే క్రమంలో ఆ కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో దొంగతనానికి వెళ్లిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మిడ్జిల్ మండల పరిధిలోని బోయిన్పల్లి గ్రామంలో గల ప్రగతి సోలార్ ప్లాంట్ లో తరచుగా కేబుల్ దొంగతనాలు జరుగుతుండడంతో సోలార్ యజమాన్యం రెండు కంచెలు ఏర్పాటు చేశారు.
ఇందులో రెండో కంచెకు కరెంటు పెట్టినట్టు సమాచారం ఈ క్రమంలో దొంగతనానికి వచ్చిన వ్యక్తులు మొదటి కంచె కట్ చేసుకుని లోపలికి వెళ్లి రెండో కంచె కట్ చేసే క్రమంలో కరెంటు సరఫర ఉండడంతో కింద తడిగా ఉండడంతో విద్యుత్ షాక్కు గురై ఇద్దరు మృత్యువాత పడ్డట్లు సమాచారం. ఈ ఘటన విషయం తెలుసుకున్న మిడ్జిల్ ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతి చెందిన వారి వివరాలు సేకరించేందుకు అన్వేషిస్తున్నామని తెలిపారు. కాగా వీరితో పాటు మరో ఇద్దరు ముగ్గురు వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. వీరిలో ఒక మహిళ కాళీ గొలుసు పట్టిలు అక్కడ పడి ఉండడాన్ని గుర్తించారు. ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.