24-04-2025 09:11:19 PM
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి(Medchal ACP Srinivas Reddy) గురువారం మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఓఆర్ఆర్ వద్ద దుండిగల్ పోలీసులు, మేడ్చల్ ఎస్ఓటి ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఒడిశాలోని సుక్మా నుండి తెలంగాణ రాష్ట్రం మీదుగా కర్ణాటకలో గుల్బర్గాకు చెందిన దేవా సచిన్ అనే వ్యక్తికి గంజాయి సరఫరా చేస్తున్నారు. నిందితుల వద్ద నుండి 33 లక్షల విలువ చేసే 94 కిలోల గంజాయి, మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు షేక్ మున్నావారు, గంటసాల జగదీశ్ భద్రాద్రి కొత్తగూడెం సారపాకకు చెందిన వారుగా గుర్తించారు. వీరికి సహకరించిన దేవా సచిన్ పరారీలో ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.