న్యూఢిల్లీ, జనవరి 3: డిపాజిట్లను ఆకర్షించేందుకు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు కొత్త డిపాజిట్ స్కీమ్‌ల్ని ప్రారంభించింది. ఖాతాదారులకు మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి, విలువను పెంచడానికి ‘హర్ ఘర్ లాఖపతి’, ‘ఎస్బీఐ పాట్రన్స్’ అనే డిపాజిట్ స్కీమ్‌ల్ని డిజైన్ చేసినట్లు శుక్రవారం ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
లక్ష రూపాయ లు, అంతే గుణిజాల్లో పొదుపును చేకూర్చుకునే రీతిలో ‘హర్ ఘర్ లాఖపతి’ అనే రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ను రూపొందించామని పేర్కొంది. 80 ఏండ్లు, అంతకుపైబడిన సీనియర్ సిటిజన్ల కోసం ‘ఎస్బీఐ పాట్రన్స్’ అనే ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని డిజైన్ చేశామని, బ్యాంక్‌తో దీర్ఘకాలిక సంబంధాన్ని కొనసాగిస్తున్న సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్ ద్వారా అధిక వడ్డీ లభిస్తుందని ఎస్బీఐ వివరించింది.