calender_icon.png 23 February, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గందరగోళం సృష్టించిన రెళ్ల పేర్లు

17-02-2025 12:30:54 AM

  • ‘కుంభమేళా’ భక్తులు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట 
  • 18 మంది మృతి.. పలువురికి గాయాలు
  • ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో మహా విషాదం
  • రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: రెండు రైళ్ల పేర్లు ఒకేలా ఉండటంతోనే గందరగోళం ఏర్పడి  ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శనివారం రాత్రి 10 గంటలకు చోటు చేసుకున్న ఈ తొక్కిసలాటలో 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

14వ ప్లాట్ ఫామ్‌పై అప్పటికే ప్రయాగ్‌రాజ ఎక్స్‌ప్రెస్ నిలిచి ఉండటంతో ప్రయాణికులు తొలుత ఆ ప్లాట్‌ఫాం వద్దకు చేరుకున్నారని, అదే సమయంలో 12, 13, 15 ప్లాట్‌ఫామ్ నంబర్లు రావాల్సిన మగధ్ ఎక్స్‌ప్రెస్, స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు ఆయా ప్లాట్‌ఫామ్‌లపై వేచి ఉండటంతో రద్దీ పెరిగినట్టు వెల్లడించారు.

ఈ క్రమంలోనే 16వ ప్లాట్‌ఫామ్ మీదకు ప్రయాగ్‌రాజ్ ప్రత్యేక రైలు వచ్చినట్టు స్టేషన్‌లో అనౌన్స్‌మెంట్ రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా గందరగోళానికి లోనైనట్టు తెలిపారు. దీంతో 14వ ప్లాట్‌ఫామ్‌లోని ప్రయాణికులు తాము ఎక్కాల్సిన రైలు 16వ ప్లాట్‌ఫామ్ మీదకు వస్తుందని భావించి ఒక్కసారిగా అటువైపు పరుగులు తీయడంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌పై తొక్కిసలాట జరిగిందని వివరించారు. 

ఈ దుర్ఘటనలో తొమ్మిది మహిళ లు, ఐదుగురు పిల్లలు సహా 18 మంది ప్రా ణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు.  దీనిపై దర్యాప్తు కోసం ఇద్దరు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొక్కిసలాట ఘటనపై ఎక్స్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. తొక్కిసలాట ఘటన తన ను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని పే ర్కొన్నారు.

బాధిత కుటుంబాలకు పరిహారం

తొక్కిసలాటలో ప్రాణాల కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు. దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2.5లక్షలు, స్వలంగా గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున అందించనున్నట్టు వెల్లడించారు. 

విపక్షాల ఆగ్రహం

ఢిల్లీలో చోటు చేసుకున్న దుర్ఘటనపై విపక్షాలు విచారం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాతే మీడియా సమావేశంలో మాట్లాడుతూ దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వేశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయలన్నారు. ఆమ్‌ఆద్మీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 

గతంలోనూ తొక్కిసలాటలు..

న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్‌లో గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగాయి. 2012లో బిహార్‌కు వెళ్లే రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పరుగులు తీయడంతో 14ఏళ్ల బాలుడు, 35ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు.

2010లో పాట్నాకు వెళ్లాల్సిన రైలు ప్లాట్‌ఫామ్‌ను అధికారులు చివరి నిమిషంలో మార్చడంతో తొక్కిసలాట జరగ్గా ఇద్దరు మరణించారు.  అలాగే 2004లో బిహార్‌కు వెళ్లే రైల్లో ఎక్కాలనే తొందరలో ప్రయాణికులు పరుగులు తీయగా  తొక్కిసలాట జరిగి ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.