calender_icon.png 27 October, 2024 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో మరో రెండు ఆర్జీయూకేటీలు!

18-09-2024 12:00:00 AM

మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో ఏర్పాటు

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో రెండు ఆర్జీయూకేటీ (రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్) విద్యాసంస్థలు రానున్నాయి. ఇప్పటికే బాసరలో ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ ఉంది. అయితే కొత్తగా రాబోయే రెండు విద్యాసంస్థలు దీనికి అనుబంధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో ఒకటి, మహబూబ్‌నగర్‌లో ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ సబ్‌కమిటీ ముందుకు ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలిసింది.

ఒక్కోచోట వెయ్యి చొప్పున దాదాపు మొత్తం రెండు వేల సీట్లు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఆరేళ్ల ఇంటిగ్రెటెడ్ బీటెక్ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను అధికారులు ఇటీవల సమావేశమైన విద్యాసంస్కరణ క్యాబినెట్ సబ్‌కమిటీకి అందజేసినట్లు తెలిసింది. వీటిని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం ఉన్న ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్ ఐటీ నిర్మల్ జిల్లాలో ఉంది. మిగతా జిల్లాల నుంచి ఇక్కడికి వెళ్లి చదువు కోవాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలను పంపేందుకు ఆలోచిస్తున్నారు. ఈక్రమంలోనే మిగతా జిల్లాల వారికి కూడా ప్రయోజనం కలిగేలా ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు అధికారికవర్గాలు తెలిపాయి.