27-04-2025 11:36:07 PM
హుస్నాబాద్ (విజయక్రాంతి): సిద్దిపేట - హుస్నాబాద్ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మేస్త్రీలు చనిపోయారు. కోహెడ మండలం బస్వాపూర్ కు చెందిన మేస్త్రీలు తాడెం సారయ్య, బండోజు గణేశ్ బైక్‌పై ప్రయాణిస్తుండగా, వేగంగా దూసుకొచ్చిన తుఫాన్ వాహనం వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అధిక సంఖ్యలో వాహనాలు తరలిరావడంతో రహదారి రద్దీగా మారడం, ఆ సమయంలో తుఫాన్ వాహనం అతివేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ దుర్ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ తరపున ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తామని ప్రకటించారు.
బీఆర్ఎస్ పై విమర్శలు
బీఆర్ఎస్ రజతోత్సవ సభ ముగించుకొని వెళ్తున్న వాహనం ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సభల కోసం మద్యం ఏరులై పారించి, అతివేగంగా వాహనాలు నడపడం వల్లే నిండు ప్రాణాలు బలయ్యాయని విమర్శించారు. మృతుల కుటుంబాలను బీఆర్ఎస్ తక్షణమే ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు.