04-03-2025 01:20:58 AM
9 కిలోల గంజాయి, రెండు కార్లు స్వాధీనం
చేవెళ్ల, మార్చి 3: చేవెళ్ల పోలీసులు ఇద్దరు గంజాయి పెడ్లర్లను అరెస్ట్ చేశారు. సీఐ భూపాల్ శ్రీధర్, డీఐ ఉపేందర్ వివరాల ప్రకారం... ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో చేవెళ్ల ఎస్త్స్ర శిరీష, పెట్రోలింగ్ టీమ్ తో మండలంలోని ముడిమ్యాల నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్నారు. కేసారం గ్రామ శివారులోని బైపాస్ రోడ్డు వద్ద వేగనార్ కారు, హోండా యాక్టివా కారుతో పాటు నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు.
పోలీసులను చూసిన వెంటనే కార్లలో పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ, పోలీసులు అప్పటికే ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. మిగితా ఇద్దరు పారిపోయారు. పట్టుబడ్డ వారిని తనిఖీ చేయగా.. వాహనాల్లో దాచిపెట్టిన బ్యాగ్ లలో 9 కిలోల గంజాయి దొరికింది. దీంతో క్లూస్ టీమ్ , మధ్యవర్తుల సమక్షంలో గంజాయితో పాటు రెండుకార్లు, రెండు సెల్ ఫోన్లు, తూకం మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను రాత్రి 10 గంటల సమయంలో అరెస్ట్ చేసి ఎన్ డీపీఎస్ చట్టం (నార్కొటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్) కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుల్లో ఒకరు చేవెళ్లలో నివాసం ఉంటున్న ఏపీలోని రాజమండ్రికి చెందిన గోబేరు వెంకట చైతన్య అలియాస్ షేక్ రిజ్వాన్ కాగా, మరో వ్యక్తిని ఉప్పల్ లో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న సూర్యాపేటకు చెందిన కూరెళ్ల సాయి అరుణ్గా గుర్తించారు.
ఇందులో గోబేరు వెంకట చైతన్య పై 2023 లో మేడ్చల్ పీఎస్ పరిధిలో, కూరెళ్ల సాయి కిరణ్ పై 2021లోనే మొయినాబాద్ పీఎస్ లో ఎన్ డీపీఎస్ చట్టం కింద నమోదైంది. వీళ్లు మియాపూర్ కు చెందిన శ్రీకాంత్ యాదవ్, విశాఖ పట్నంలోని అరకు కు చెందిన సేన నుంచి గంజాయి తీసుకొని అమ్ముతున్నట్లు విచారణలో ఒప్పుకున్నారు.
నిందితులిద్దరినీ సోమవారం కోర్టులో హాజరు పరిచామని, పరారీలో ఉన్న నాగోల్ లో నివాసం ఉండే సూర్యాపేటకు చెందిన గణేశ్, షేక్ అబ్బాస్ ను త్వరలోనే పట్టుకుంటామని సీఐ వెల్లడించారు.