చిన్నశంకరంపేట,(విజయక్రాంతి): మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోళ్ల ఫారం గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన చిన్న శంకరంపేట మండలం కామారం తాండ గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... చిన్న శంకరంపేట మండల పరిధి కామారం తండా పంచాయతీ పరిధిలో కోళ్ల ఫారం నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గోడకూలి సిమెంట్ ఇటుకలు యువకులపై పడడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికులు సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. వీరంతా జార్ఖండ్ రాష్ట్రం బాస్నా గ్రామం, సాహెబ్ గంజ్ జిల్లా కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. మృతి చెందిన వారు అలాం, రఫిక్ అలాo, గాయపడ్డిన వారు ఇంతోసర్ అలాం, నసీం అక్తర్ లుగా పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నారాయణ గౌడ్ వెల్లడించారు.