20-04-2025 04:58:22 PM
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ఓఆర్ఆర్(ORR) పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్(Dundigal Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మేడ్చల్ నుండి పఠాన్చెరు వైపు వెళ్తున్న ఐ20 కారు (OD 10 T1947)మల్లంపేట్ ఎగ్జిట్ 4ఏ దగ్గరకు రాగానే అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న కోకాపేట్ కు చెందిన భాను ప్రకాష్(36), అతని స్నేహితుడు నళినికంఠ బిస్వాల్(37) అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి గల కారణమని సమాచారం. భాను ప్రకాష్ భార్య సాయిలక్ష్మి ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.