23-02-2025 12:28:24 AM
అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్‌ను ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి) : ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్‌ను తెలంగాణ ప్రభుత్వం శనివారం రిలీవ్ చేసింది. ఏపీలో చేరేందుకు వీలుగా వెంటనే రిలీవ్ చేస్తున్నట్లు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఇద్దరిని ఏపీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరో అధికారి కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి రిలీవ్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. కరీంనగర్‌లో ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నందున అభిషేక్ మహంతి విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఈసీని కోరింది.
2014లో ఉమ్మడి రాష్ర్ట విభజన అనంతరం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ).. రెం డు రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారులను కేటాయించింది. దీనిపై కొంద రు క్యాట్‌ను ఆశ్రయించడం.. తర్వాత డీవోపీటీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
చివరకు 2024లో నియమించిన ఖండేకర్ కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్‌లను ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.దీంతో అంజనీ కుమార్ (1990 బ్యాచ్), అభిలాష్ బిస్త్ (1994 బ్యాచ్)లను తెలంగాణ సర్కారు రిలీవ్ చేసింది.