30-03-2025 03:52:43 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): బియ్యం లారీనుంచి బస్తాలు పడిన ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇరువురు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనగడపలోని రమేష్ డీలర్ చౌక డిపోలో బియ్యం దిగుమతి చేసి తిరిగి వస్తున్న క్రమంలో కొత్తగూడెం ఏరియా సింగరేణి జీఎం ఆఫీస్ సమీపంలో స్టోర్ బియ్యం తరలిస్తున్న లారీ నుంచి రెండు బస్తాలు కింద పడిపోయ్యాయి. అదే సమయంలో అటుగా వస్తున్న తిప్పనపల్లికి చెందిన సయ్యద్ రహమాన్ (వికలాంగుడు)తో పాటు అతని మిత్రుడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా మూడు బస్తాలు పైనుండి జారి పడటంతో ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లడంతో వారిరువురికి గాయాలయ్యాయి. బియ్యం సరఫరా చేసే లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. 108 కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను, కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 2 టౌన్ పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.