calender_icon.png 31 January, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరికి బెయిల్

31-01-2025 01:20:03 AM

  1. మాజీ పోలీస్ అధికారులు భుజంగరావు, రాధాకిషన్‌రావుకు ఊరట
  2. దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు నిందితులకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.  అడిషనల్ మాజీ ఎస్పీ నాయిని భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు పలు షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున రెండు ష్యూరిటీలు, పాస్‌పోర్టులను కింది కోర్టులో సమర్పించాలని ఆదేశించింది.

పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, సాక్ష్యులను బెదిరించడం, ప్రభావితం చేయరాదని సూచించింది. ఈ మేరకు గురువారం జస్టిస్ కే సుజన ఉత్తర్వులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024, మార్చిలో భుజంగరావు, రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. 

వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల నిమిత్తం భుజంగరావుకు నాంపల్లి కోర్టు ఆగస్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి కోర్టుల ద్వారా మధ్యంతర బెయిల్ పొందుతూ వచ్చారు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. మరోవైపు చంచల్‌గూడ జైలులో ఉన్న రాధాకిషన్‌రావు కూడా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువడింది. 

ఇవీ ఇరుపక్షాల వాదనలు

భుజంగరావు ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని, మళ్లీ జైలుకు పంపితే ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని అతడి న్యాయవాది వాదించారు. ఇప్పటికే గుండెకు స్టెంట్లు వేశారని, గుండెజబ్బుతో పాటు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని, రోజూ డయాలసిస్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారని వివరించారు.

గత ప్రభుత్వ పెద్ద ఫోన్ ట్యాపింగ్ వెనకున్నారని పోలీసులు చెబుతున్నా అది ఎవరో పేర్కొనలేదన్నారు. ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన వారుగానీ, తమ వద్ద డబ్బు వసూలు చేశారన్న బాధితులుగానీ ఎవరూ లేరన్నారు. పోలీసులు కట్టుకథ అల్లారని చెప్పారు. “భుజం గరావు గత ప్రభుత్వ పాలకులకు అత్యంత సన్నిహితుడు.

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. 2020లో రాధాకిషన్‌రావు పదవీ విరమణ చేశాక నాటి ప్రభుత్వ పెద్దలు టాస్క్‌ఫోర్స్ అధికారిగా నియమించారు. 15 రోజుల్లో దాదాపు 4,500 ఫోన్లు ట్యాప్ చేశారు. జైలుకు వెళ్లకుండా తప్పించుకోవడానికే భుజంగరావు అనారోగ్యాన్ని కారణంగా చూపిస్తున్నారు.

విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆ దశలో రాధాకిషన్‌రావు, భుజంగరావుకు బెయిల్ ఇవ్వడం సరికాదు” అని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు ప్రతివాదన చేశారు. వాదనల తర్వాత హైకోర్టు ఇద్దరు నిందితులకూ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ వేర్వేరుగా తీర్పులు వెలువరించింది.

బెయిల్ ఇవ్వాలంటూ వారిద్దరూ వేసిన వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పు వెలువరించడానికి ఒక్కరోజు ముందు పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు సీల్ కవర్లో దర్యాప్తు అధికారులు ఇచ్చిన నివేదికను హైకోర్టుకు అందజేశారు. మరో 19 మంది హైకోర్టు న్యాయమూర్తులపై కూడా నిందితులు నిఘా పెట్టారని, దర్యాప్తు జరుగుతున్నందున బెయిల్ ఇవ్వొద్దని కోరారు.

దీనిపై న్యాయమూర్తి తన తీర్పులో.. న్యాయమూర్తుల వివరాలతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీల్ కవర్లో నివేదిక అందజేశారని చెప్పారు. ఈ నివేదికపై పిటిషనర్ న్యాయవాది ఇ.ఉమామహేశ్వరరావు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఇవే విషయాలను సుప్రీంకోర్టులో చెప్పారని, తిరుపతన్న కంప్యూటర్లో ప్రొఫైల్స్ ఉన్నాయని చెప్పి వాళ్ల ఫోన్ల ట్యాపింగ్‌కు పిటిషనర్లు ప్రయత్నించారని చెప్పడం అన్యాయమన్నారు.

ఇవన్నీ చెప్పిన తర్వాతే ఇదే కేసులో నిందితుడు తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందని గుర్తు చేశారు. సీల్ కవర్లో పేర్కొన్న వివరాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకున్నాకే కీలక నిందితుడు తిరుపతన్నకు బెయిల్ ఇచ్చిందని చెప్పారు. సుమారు 10 నెలలకుపైగా పిటిషనర్లు జైలులో ఉన్నారని, విచారణ ప్రక్రియ ఇప్పట్లో మొదలుకాదని, సుదీర్ఘ కాలం నిర్బంధంలో ఉంచడం హక్కులను హరించడమేనని చెప్పారు.

ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు, ఇద్దరు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా, ఇదే కేసులో మరో నిందితుడు తిరుపతన్నకు ఇటీవలే సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో నిందితుడైన శ్రవణ్‌కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించాల్సివుంది.