కూకట్ పల్లి,(విజయాక్రాంతి): ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్థినీలు అదృశ్యమయ్యారన్న వార్త వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన గురిచేసింది. ఈ సంఘటన గురువారం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... కూకట్పల్లి వివేకానంద నగర్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో లక్ష్మి దుర్గ, హారిక లు 8వ తరగతి చదువుతున్నారు. రోజు మాదిరిగానే బుధవారం స్కూల్ కు వచ్చిన ఇద్దరు విద్యార్థులు తిరిగి ఇంటికి రకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని అడిగారు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు కిడ్నాప్ కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా సాయంత్రం స్కూలు విడిచిపెట్టిన అనంతరం బయటికి వచ్చిన దుర్గ, హారికలు పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లినట్లు గుర్తించారు. అప్పటికే తమతో పాటు తెచ్చుకున్న బట్టలను మార్చుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరు బయటికి వెళ్లారు. తరచూ మీరు ఇరువురు సూర్యలంక బీచ్ వెళ్లాలని తరగతి రూమ్ లో చర్చించుకునే వారని పోలీస్ విచారణలో తెలిసింది. దుర్గ, హారికలు సూర్యలంక బీచ్ కి వెళ్లి ఎంజాయ్ చేసినట్లు సమాచారం. కూకట్పల్లి పోలీసులు విద్యార్థులను తీసుకువచ్చేందుకు వెళ్లినట్లు తెలిసింది. వారు వస్తే పూర్తి సమాచారం తెలుస్తుందని కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్ రావు తెలిపారు.