calender_icon.png 30 October, 2024 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం

02-07-2024 05:30:47 AM

  • ప్రజావాణిలో కలకలం
  • జనగామలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న మహిళ 
  • గద్వాలలో పురుగుల మందు తాగేందుకు యత్నించిన రైతు
  • భూసమస్యల పరిష్కారం చేయట్లేదని నిరసనలు

జనగామ/గద్వాల(వనపర్తి), జులై 1 (విజయక్రాంతి): అధికారులు తమ భూసమస్యలను పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. జనగామ, జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లలో ప్రజావాణి సాక్షిగా జరిగిన ఈ ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా నర్మెటకు చెందిన దేవులపల్లి జ్యోతికి తన తండ్రి ఎకరా 4 గుంటల భూమి పట్టా చేశాడు. ఆ భూమిని ఓ పార్టీకి చెందిన నాయకుడు జంగేటి అంజయ్య కబ్జా చేశాడని ఆరోపిస్తూ ఆమె కొన్ని రోజులుగా రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతోంది. తన తండ్రి వద్ద అంజయ్య భూమి కొన్నట్టు తప్పుడు అగ్రిమెంట్ కాగితం సృష్టించి భూమిని కబ్జా చేశాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు.

ఈ విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని ఆమె సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చింది. అధికారుల తీరుతో విసిగిపోయిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి వద్ద కొన్ని నిద్రమాత్రలు వేసుకుని కలెక్టరేట్‌కు చేరుకుంది. గ్రీవెన్స్ ప్రారంభం కాకముందే అక్కడికి చేరుకున్న జ్యోతి ఉన్నట్టుండి ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించింది. గమనించిన కలెక్టరేట్ సిబ్బంది పెట్రోల్ డబ్బాను తీసుకున్నారు. సీఐ రఘుపతిరెడ్డి ఆమెతో మాట్లాడారు. తన భూ సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు చెప్పిన బాధితురాలు.. అపస్మారక స్థితిలో చేరుకుంది.

పోలీసులు ప్రశ్నించగా నిద్ర మాత్రలు వేసుకొని వచ్చినట్టు తెలిపింది. దీంతో ఆమెను వెంటనే జనగామ జిల్లా దవాఖానకు పంపించారు. సమస్య కలెక్టర్‌కు విన్నవించుకుంటే పరిష్కరిస్తారని, అర్జీ ఇవ్వకుండానే ఇలా చేయడం తగదని సీఐ రఘుపతిరెడ్డి అన్నారు. వారం క్రితం కూడా కలెక్టరేట్‌లో జనగామ మండలం పసరమడ్లకు చెందిన నర్సింగరావు కలెక్టరేట్ భవనం ఎక్కి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వారం వ్యవధిలో రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో ఆందోళన వ్యక్తం అవుతున్నది.  

తన భూమిని కబ్జా చేశారని..

తన భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. గద్వాల కలెక్టరేట్‌లో సోమవారం చోటుచేసుకున్నది. అయిజ మండలం గుడిదొడ్డికి చెందిన రైతు పరశురాముడు తన భూమిని కబ్జా చేశారని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆరోపించాడు. ప్రజావాణిలో కలెక్టర్ ఎదుటే ఆత్మహత్యాయత్నంచేయగా పోలీసులు అడ్డుకుని దవాఖానకు తరలించారు.