రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
నిర్మల్, నవంబర్ 29 (విజయక్రాంతి): వారం క్రితం నిర్మల్ మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టబడిన ఘటన మరువక ముందే మరో ఇద్దరు అధికారులు శుక్రవారం పట్టుబడ్డారు. నిర్మల్ పట్టణం బుధవార్‌పేట్ కాలనీకి చెందిన హ రీశ్‌కు మామాడ మండలంలోని ఆదర్శనగర్ సర్వే నంబర్ 11లో భూమి ఉన్నది.
దానికి సంబంధించిన సేతువార్ మ్యాప్ కోసం జిల్లా కేంద్రంలోని ల్యాండ్ రికార్డు కార్యాలయంలో వారం కిందట దరఖాస్తు చేసుకున్నాడు. అయితే రూ.20వేలు ఇస్తేనే రికార్డులను వెతికి ఇస్తానని జూనియర్ అసిస్టెంట్ జగదీశ్ చెప్పడంతో హరీశ్ అందుకు అంగీకరించి.. విషయాన్ని సీబీఐ అధికారులకు చెప్పాడు.
రూ.10వేలు ముందుగా ఇవ్వాలని చెప్పడంతో.. శుక్రవారం రికార్డు కార్యాలయంలో అటెండర్ ప్రశాంత్ రూ.10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ జగదీశ్‌తోపాటు అటెండర్‌ను అదుపు లోకి తీసుకొని విచారణ అనంతరం కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్టు అధికారులు తెలిపారు.