బీజాపూర్: నక్సలైట్లు అమర్చిన ఐఈడీ బాంబు పేలుడులో ఇద్దరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లు మృత్యువాత పడ్డారు. బాంబు పేలుడు ఘటనలో మరో నలుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ అటవీప్రాంతంలో నక్సల్స్ బాంబు పెట్టినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఇద్దరిని రాయ్ పూర్ నివాసి భరత్ సాహు, నారాయణపూర్ జిల్లాకు చెందిన సత్యర్ సింగ్ కాంగేగా గుర్తించారు.
బీజాపూర్-సుక్మా-దంతేవాడ జిల్లాల ట్రై జంక్షన్‌లోని అడవుల్లో నక్సలైట్ల వ్యతిరేక ఆపరేషన్ తర్వాత భద్రతా సిబ్బంది సంయుక్త బృందం తిరిగి వస్తుండగా టార్రెమ్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగిందని ఇక్కడ పోలీసు అధికారి తెలిపారు. నక్సలైట్ల ఉనికికి సంబంధించిన ఇన్‌పుట్‌ల ఆధారంగా మంగళవారం ప్రారంభించిన ఆపరేషన్‌లో ఎస్‌టిఎఫ్, జిల్లా రిజర్వ్ గార్డ్ - రాష్ట్ర పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), ఎలైట్ యూనిట్ కోబ్రాకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.