calender_icon.png 18 November, 2024 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు!

18-11-2024 01:31:46 AM

  1. రేవంత్, కేటీఆర్ కుటుంబాల మధ్య వ్యాపార సంబంధాలు
  2. వాటిని నేను నిరూపిస్తా.. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకొంటా..
  3. హామీల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ సర్కార్ మూసీ ప్రక్షాళన
  4. బీజేపీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు.. 
  5. నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతున్నాం..
  6. కేంద్ర హోం సహాయశాఖ మంత్రి బండి సంజయ్

సంగారెడ్డి, నవంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణను ఇద్దరు సీఎంలు పాలిస్తున్నారని.. ఒకరు రేవంత్‌రెడ్డి కాగా, మరొకరు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లాకేంద్రంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబానికి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని, వాటిని తాను బయటపెడతానని ప్రకటించారు. ఆ వ్యాపార సంబంధాలను బయటపెట్టకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన వాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల్లా బీజేపీ నేతలు, నాయకులు ఎక్కడా భూ కాబ్జాలు చేయలేదని స్పష్టం చేశారు.

కమీషన్లు తీసుకుని రాజకీయం చేసే పార్టీ బీజేపీ కాదని కొనియాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి అడ్డుకుంటున్నాయని, అందుకు అవసరమైతే ఎలాంటి డ్రామాకైనా తెరితీస్తాయని వివరించారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై జరిగిన  దాడిలో బీఆర్‌ఎస్ నాయకుల కుట్ర ఉందని, ఆ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉందని ఆరోపించారు. కానీ, పోలీసులు కేటీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. 

పోలీసులు అమాయకులైన రైతులను అరెస్టు చేసి, కుట్రదారులను అరెస్ట్ చేయకపోవడం శోచనీయమన్నారు. ఫోన్ ట్యాపరింగ్‌లో కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు, కేటీఆర్‌ను అరెస్టు చేయించలేదని ప్రశ్నించారు. జన్వాడ ఫాం హౌస్ కేసులోనూ అదే తంతు జరిగిందని ఆరోపించారు. సిరిజిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. కేటీఆర్‌కు తెలియకుండా ట్యాపింగ్ జరగదని ఆరోపించారు.

అలాగే ఈ ఫార్ములా, ఫాం హౌస్ డ్రగ్స్ కేసుల సంగతేమైందని నిలదీశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలిం చి ధరణి పేరుతో వేలాది ఎకరాలను కొల్లగొట్టిందని ఆరోపించారు. దీపావళి తర్వాత భారీగా బాంబులు పేలుతాయని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారని, వాటిని ఎక్కడ పేల్చారో తేల్చాలని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసానికి గురిచేసిందని, ఆ పార్టీ బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతగానితనంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని ఆరోపించారు.

మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు..

రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, తమ పార్టీ కేవలం నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తమ పార్టీ మొదటి నుంచి ప్రక్షాళన కోరుతుందన్నారు. కానీ, నది ప్రక్షాళనను అడ్డం పెట్టుకొని రాష్ట్రప్రభుత్వం  హామీల అమలుపై దృష్టి సారించకపోవడం దారుణమన్నారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనడం లేదని, దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని, 1,700 చోట్ల కోనుగోలు కేంద్రాలే ప్రారంభం కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి క్వింటాకు రూ.2,300 చొప్పున మద్దతు ధర ప్రకటించిందని గుర్తుచేశారు.

రాష్ట్రప్రభుత్వం సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని బీరాలు పలికి, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. తేమ పేరుతో రైతులను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ధాన్యాన్ని దొడ్డిదారిన దళారులకు అప్పగిస్తున్నదని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు.