26-02-2025 02:00:09 AM
సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి కుంటలో పడి మృత్యువాత
కామారెడ్డి, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామేశ్వరపల్లి శివారులో పల్లె వాణికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన ఘటన మంగళవారం వెలుగు లోకి వచ్చింది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి ఇందిరానగర్ కాలనీ చెందిన ఇద్దరు చిన్నారులు సోమవారం సాయంత్రం సైకిల్ తొక్కుతూ ఆడుకుంటూ వెళ్తున్న ఇద్దరు చిన్నారులు 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న పల్లె వాణి కుంటలో పడి మృతి చెందారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన జగన్నాథం శివ (10), కుంభ సంతోష్ (08) ఇద్దరు పిల్లలు ఇందిరా నగర్ కాలనీలో ఒకరు 4వ తరగతి, ఒకరు 2వ తరగతి చదువుతున్నారు. సైకిల్ తొక్కుకుంటూ ఆడుకోవడానికి పల్లె వాని కుంట వరకు వెళ్లగా ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందారు.
అటువైపుగా వెళ్లిన కొందరు గమనించి కాలనీ వాసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు కుంట వద్దకు వెళ్లారు. ఇద్దరు చిన్నారుల మృతదేహా లను చూసి బోరున విలపించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జీజీహెచ్ కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.