22-02-2025 01:54:53 AM
కరీంనగర్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): కరీంనగర్-మెదక్-నిజామాబాద్-అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మేయర్ సర్దార్ రవీందరసింగ్ కు ఆ పార్టీ నేతల నుండి మద్దతు కరువయింది. పార్టీ నగర అధ్యక్షునిగా, మేయర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా పనిచేసిన రవీందరసింగ్ ఈసారి బిర్‌ఎస్ పార్టీ నుండి అభ్యర్థిని బరిలో నిలపకపోవడంతో ఏఐఎఫ్ బి పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆయన ప్రచార హోర్డింగ్ లో గాని, కరపత్రాల్లో కాని కేసీఆర్ నుంచి మొదలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతల ఫోటోలను ఉంచి ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న సమయం వరకు అధినేత నుండి పార్టీ శ్రేణులకు రవీందరసింగ్ కు మద్దకు తెలుపండనే సంకేతాలు రాలేదు. దీంతో ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బిఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ రవీందరసింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి అనూహ్యంగా ఓట్లు చీల్చారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం తిరిగి రవీందర్ సింగ్ మళ్లీ కేసీఆర్ కు దగ్గరై పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పదవిని దర్శించుకున్నారు.
మహారాష్ర్టలో బీఆర్‌ఎస్ పార్టీ నిర్మాణ సమయంలో కేసీఆర్ వెంటే అడుగులు వేసిన రవీందర్ సింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ తనకే వస్తుందని చివరి వరకు ఆశించారు. అయితే పార్టీ బరిలో ఉండవద్దని నిర్ణయించడంతో రవీందర్ సింగ్ బ్యాలెట్ లో ముందువరుసలో పేరు ఉండేందుకు ఆలిండియా ఫార్వర్ బ్లాక్ బి ఫామ్ తో నామినేషన్ దాఖలు చేశారు. విస్తృత ప్రచారం చేస్తున్న రవీందర్ సింగ్ గెలుపు తనదేనంటూ ఆశీస్సులు, పార్టీ ఆశీస్సులు తనకే ఉంటాయని అనుచరుల వద్ద చెప్పుకువస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ క్యాడర్ రవీందరసింగ్ స్పీడ్ తగ్గితే బీజేపీ అభ్యర్థికి కాని, బీఎస్పీ నుండి పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న బీఆర్‌ఎస్ పట్టభద్రుల ఓటర్లు, పార్టీ నాయకులు చివరి క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. రవీందరసింగ్ పోటీలో ఉండడం వల్ల ఆయనకు లాభం చేకూరుతుందా, ఇతర అభ్యర్థులకు లాభం చేకూరుతుందా చూడాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం రవీందర్ సింగ్ బీఆర్‌ఎస్ లోనే కొనసాగుతారా, లేక ఇతర పార్టీలవైపు మొగ్గు చూపుతారా అన్నది వేచి చూడాలి. ఎమ్మెల్సీ స్థానం కోసం రెండుసార్లు ప్రయత్నం చేసి భంగపడ్డ సింగ్ కింగ్ అవుతాడా లేక ఎవరి పుట్టి ముంచుతారో చూడాలి.