ముంబయి: ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో మరో రెండు కొత్త బైకులను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. బ్రిటీష్ మోటార్ సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్‌తో కలిసి గతేడాది ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400ఎక్స్ బైక్‌లను లాంచ్ చేసిన బజాజ్.. తాజాగా మరో రెండు బైక్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ట్రయంఫ్ స్పీడ్ టీ4 , స్పీడ్ 400ఎంవై25 పేరిట వీటిని విడుదల చేసింది. స్పీడ్ టీ4 ధర రూ.2.17 లక్షలు (ఎక్స్- షోరూమ్), స్పీడ్ 400 ఎంవై25 ధర రూ.2.40 లక్షలు (ఎక్స్- షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.
ట్రయంఫ్ స్పీడ్ టీ4ను 400సీసీ ఇంజిన్‌తో తీసుకొచ్చారు. లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ యూనిట్ కలిగి ఉంటుంది. గతేడాది తీసుకొచ్చిన స్పీడ్ 400 కంటే దీని ఇంధన సామర్థ్యం 10 శాతం అధికం అని కంపెనీ చెబుతోంది. ఈ బైక్ టాప్‌స్పీడ్ 135 కిలోమీటర్లు. 6 స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తోంది. మూడు రంగుల్లో లభిస్తుంది. స్పీడ్ 400లో ఎంవై25 బైక్ 398cc ఇంజిన్‌తో తీసుకొచ్చారు. ఇది లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్. నాలుగు రంగుల్లో లభిస్తుంది.భారత్‌లో ప్రీమియం మోటార్ సైకిల్ విభాగంలో తన వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా కొత్త బైక్‌లను బజాజ్ లాంచ్ చేస్తోంది.