భైంసా, డిసెంబర్ 24: పలు ఆలయాల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు నిం దితులను కుభీరు పోలీసులు అరెస్టు చేశారు. భైంసా ఏఎస్పీ అవినాశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భైంసాకు చెందిన ప్రదీప్, నర్సాపూర్ జీ గ్రామానికి చెందిన వెంకట లక్ష్మి జల్సాలకు అలవాటుపడి గత ఆరు నెలలుగా భైంసా డివిజన్‌లోని బాసర, ముథోల్, చొండి గ్రామాల్లోని ఆలయాల్లో చోరీలకు పాల్పడు తున్నారు.
సోమవారం తెల్లవారుజామున కుభీరు మండలం పార్డి బి రాజరాజేశ్వర ఆలయంలో హుండీని దొంగిలించేందుకు యత్నించారు. అలజడికి స్థానికులు లేచి చూడగా ప్రదీప్, వెంకటలక్ష్మి కారులో పరారయ్యారు. సమాచారం అందుకున్న భైంసా రూరల్ పోలీసులు వారిని గుండేగాం వద్ద పట్టుకున్నారు. వారి నుంచి కారు, రూ.9 వేల నగదు, విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.