calender_icon.png 19 April, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాపారం పేరిట మోసం ఇద్దరి అరెస్ట్

27-03-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26(విజయక్రాంతి): వ్యాపారం, పెట్టుబడి పేరిట హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. నగ రానికి చెందిన ఓ వ్యాపారవేత్తకు సైబర్ మోసగాళ్లు ఫోన్ చేశారు. అతని వ్యాపారానికి ఆర్డర్లు ఇప్పిస్తామని నమ్మించారు. ఆ విషయాన్ని నమ్మి వారికి రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాడు. ఆ తర్వాత అతని ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉందని ఈ మెయిల్ పంపారు. వారిని నమ్మి బాధితుడు రూ.9.50లక్షలను ఛార్జీలుగా చెల్లించాడు.

ఆ డబ్బును తీసుకున్న సైబర్ నేరగాళ్లు అతనికి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఢిల్లీకి చెందిన అమర్‌నాథ్‌సింగ్, రణ్‌వీర్‌సింగ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిపై తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కేసులున్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు సోషల్‌మీడియా కాల్స్, మెసేజాల ద్వారా బాధితున్ని మోసగించినట్లు గుర్తించారు. వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో నమ్మించారు. వారి నుంచి 4మొబైల్స్, కంపెనీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.