14-03-2025 05:28:11 PM
మంథని సీఐ బి.రాజు
మంథని,(విజయక్రాంతి): అకౌంట్లో నుండి డబ్బులు డ్రా చేసి జల్సాలకు వాడుకున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని మంథని సీఐ బి.రాజు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఐ కథనం ప్రకారం... మంథని మండలం ధర్మారం (గద్దలపల్లి) గ్రామానికి చెందిన కందుకూరి లక్ష్మి కుమారుడు చనిపోగా కుమారుని అకౌంట్లో ఉన్నటువంటి రూ.4 లక్షల 49 వేలను 25.04.2024 తేదీన లక్ష్మి తన ఎస్బీఐ అకౌంట్ లోకి బదిలీ చేయించుకుంది. తరువాత 04.09.2024 రోజున లక్ష్మి ఆ డబ్బులను డ్రా చేసుకుందామని బ్యాంకుకు వెళ్లగా ఆమె అకౌంట్లో డబ్బులు లేవని బ్యాంకు వారు తెలిపారు. దీంతో లక్ష్మీ మంథని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు విచారణ అధికారి మంథని సీఐ బి.రాజు బ్యాంకు స్టేట్మెంట్ లు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నిందితులను గుర్తించామని, నిందితులు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ కు చెందిన దామరకుంట అశోక్, 34, గుండ్ర ప్రశాంత్ కుమార్ 28, అనువారు సులభంగా డబ్బులు సంపాదించడం కోసం లక్ష్మి యొక్క అకౌంటు నెంబర్ ను మొదటి నిందితుడైన అశోక్ ఫోన్ నెంబర్ కు పేటీఎం యాప్ కు అనుసంధానం చేసి లక్ష్మి అకౌంట్లో డబ్బులు డ్రా చేసుకొని వారి జల్సాలకు, కుటుంబ అవసరాలకు వాడుకున్నారని తెలిపారు. నిందితులు చేసిన నేరాన్ని ఒప్పుకోగా వారిని తేదీ 13.03.2025 రోజున అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్ కు తరలించారు. అపరిచితులేవరికి ఓటీపీలు చెప్పవద్దని, లింకులను ఓపెన్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దని, ఎవరైనా సైబర్ మోసాలు గాని లేదా ఇతర మోసాలు చేసినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని మంథని సీఐ హెచ్చరించారు. సీఐ వెంట మంథని ఎస్ఐ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.