16-03-2025 11:41:45 PM
ఫోన్‌పే ట్రాన్సక్షన్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): సైదారాబాద్ భూలక్ష్మీ మాత ఆలయంలో అకౌంటెంట్ నర్సింగ్‌రావుపై ఈ నెల 14న యాసిడ్ దాడి చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సౌత్‌ఈస్ట్ జోన్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 14న నర్సింగ్‌రావు గుడిలో కూర్చుని ఉండగా ముసుగు ధరించిన ఓ వ్యక్తి వచ్చి తాను నరేష్ అని పరిచయం చేసుకున్నాడు. నిందితుడు నర్సింగ్‌రావును అన్నదానం వివరాలు అడిగి అకస్మాత్తుగా హ్యాపీ హోలీ అంటూ యాసిడ్ దాడికి పాల్పడ్డాడని చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. 400సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి, ద్విచక్రవాహనంపై నిందితుడు పారిపోయినట్లు గుర్తించారు.
రాయికోడ్ హరిపుత్ర అనే వ్యక్తి యాసిడ్ దాడి చేసినట్లు గుర్తించారు. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్ద నిందితుడు టోపీ కొనుగోలు కోసం చేసిన ఫోన్‌పే చెల్లింపుల ఆధారంగా అతని ఫోన్ నంబర్‌ను సేకరించారు. షేక్‌పేట్‌లోని అతని నివాసంలో అరెస్ట్ చేశారు. కాగా భూలక్ష్మి ఆలయంలో పని చేసే పూజారి రాజశేఖర్‌శర్మ ఆదేశాల మేరకు తాను యాసిడ్ దాడి చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని డీసీపీ తెలిపారు. దీంతో హరిపుత్రతో పాటు రాజశేఖర్‌శర్మను కూడా అరెస్ట్ చేశామన్నారు. యాసిడ్ దాడి చేసేందుకు రాజశేఖర్‌శర్మతో రూ.2వేలకు హరిపుత్ర ఒప్పందం కుదుర్చుకున్నాడని వెల్లడించారు.