10-02-2025 01:53:22 AM
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
కామారెడ్డి ఫిబ్రవరి ౯ (విజయ క్రాంతి) : రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడే సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) మాత్రమే అని ఆ సంఘంరాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టుల సమస్యలపై ఫెడరేషన్ ఆధ్వర్యంలో బలమైన పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అడ్ హక్ కమిటీ కన్వీనర్ కృష్ణమాచారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మామిడి సోమయ్య మాట్లాడారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, పెన్షన్ స్కీం, హెల్త్ కార్డులు, దాడుల నివారణకు ప్రత్యేక కమిటీలు, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తదితర డిమాండ్ల సాధనకై ఫెడరేషన్ ఆధ్వర్యంలో బలమైన ఉద్యమాలు చేయాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, బండి విజయ్ కుమార్, కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు యూసుఫ్ లు మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా అడ్ హక్ కమిటీ కో-కన్వీనర్లు మోహన్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రారంభించారు.