calender_icon.png 9 October, 2024 | 6:49 PM

మలుపు తిప్పిన మానుకోట

09-10-2024 12:00:00 AM

మలిదశ తెలంగాణ ఉద్యమమే ఓ చరిత్ర. ఈ ఉద్యమంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాట పటిమ మానుకోట గడ్డది. సమైక్యవాదుల కబంధహస్తాల నుంచి తెలంగాణను విడిపించాలన్న కసితో ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ‘జై తెలంగాణ’ అని నినదించారు. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం బరిగీసి కొట్లాడారు.

ఎందరో తమ ప్రాణాలను అర్పించగా, కొందరు కేసులపాలై నేటికి కోర్టులు చుట్టూ తిరుగుతూ ఆర్ధికంగా చితికిపోతున్నారు. ప్రభుత్వాలు మారినా మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారుల బతుకులు మాత్రం మారలేదు. 

మే 28, 2010.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం అసువులు బాసిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని సమాచారం అందుకున్న జేఏసీ నాయకులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున్న మానుకోట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.

ఉద్యమాన్ని బలహీనపరిచేవిధంగా వ్యవహరించిన పోలీసులపై, నాయకులపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసుల బుల్లెట్లకు ప్రతిస్పందనగా రాళ్లు రువ్వి ధీటుగా సమాధానం చెప్పారు. ఈ ఘటనలో 11 మంది తెలంగాణవాదులకు కాళ్లు, వీపు, తొడ భాగాలలో బుల్లెట్ గాయాలు కాగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఒక్కొక్కరికి ఉద్యోగం, పది లక్షల రూపాయలు ఇస్తామని ఆనాడు మాటివ్వగా, కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే అందజేసినట్లు ఉద్యమకారులు వాపోతున్నారు. గాయపడినవారిలో భూక్యా శోభన్, భూమా మధుకర్, సయ్యద్ ఇమామ్, తోట రవి, దిడ్డి వెంకటేశ్, హచ్యా, హతిరామ్, రావోజి, రంగ్యాతో పాటు మరికొంతమందికి గాయాలయ్యాయి.

మణుగూరు ఘటనకు 13 ఏళ్లు

తెలంగాణ ఉద్యమంలో తీవ్ర సంచలనం సృష్టించిన మణుగూరు ప్యాసింజర్ దహనం ఘటన జరిగి 13 ఏళ్లు అయ్యింది. ఫిబ్రవరి 23, 2011న కేసముద్రం సమీపంలో ప్యాసింజర్ రైలును దహనం చేసిన ఘటనలో కేసముద్రం స్టేషన్‌కు చెందిన బట్టు శ్రీను, వేల్పుల రేవంత్, మాందాటి యాకాంబ్రం (మరణించాడు), నర్సింగం యాదగిరి, ఠాకూర్ సతీష్, శివారపు శ్రీధర్, కొంతం సూర్యనారాయణ, చిలుకూరి కరుణాకర్‌లపై కేసు నమోదు చేశారు.

ఫిబ్రవరి 22, 2011న వరంగల్ వైపు వెళ్తున్న మణుగూరు ప్యాసింజర్ రైలు బోగీల మధ్య పైపులను కోయడం, ఇంజన్‌పై రాళ్లు రువ్వి అద్దాలు ధ్వంసం చేసిన కేసులో కూడా వీరిపై కేసు నమోదైంది. నేటికి కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

 మహబూబాబాద్, విజయక్రాంతి

మానుకోట ఘటనకు ప్రత్యక్ష సాక్షిని..

మానుకోట ఘటనకు నేను ప్రత్యక్ష సాక్షిని. ఉద్యమకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. నా పక్కనున్న వ్యక్తికి తలకు బుల్లెట్ గాయమై తీవ్రంగా రక్తం కారుతుండగా భుజాలపై మోసుకుంటూ వెళ్లి ఆసుపత్రిలో చేర్పించా. తెలంగాణపై ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మమ్మల్ని ఏ నాయకుడు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు.

 తరాల సంపత్, 

ఉద్యమకారుడు, కేసముద్రం

నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నా

మణుగూరు ఘటనలో నాతోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. నేటికి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాలాంటి ఉద్యమకారులకు గుర్తింపు లేకుండాపోయింది. ప్రభుత్వా లు మారినా మా బతుకులు మాత్రం మారలే దు. ఇకనైనా ప్రభు త్వం స్పందించి మాకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలి.

 వేల్పుల రేవంత్, 

ఉద్యమకారుడు, కేసముద్రం