బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట అటవీ ప్రాంతాల్లో జంట పులుల సంచారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. పెద్ద ధర్మారం, గురువాపూర్ ప్రాంతాల్లో గత వారం రోజులుగా పెద్దపులి సంచారం తీవ్రమైంది. కాసిపేట అటవీ ప్రాంతంలో ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసి ఆవులను చంపేయగా, ముత్యంపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి దాడి చేసి మేకలను చంపేసింది. గురువాపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి గాండ్రింపులు వినిపించాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కాసిపేట మండలానికి సమీపంలోని అటవీ ప్రాంతాలు ఉండడంతో వీటిని సేఫ్ జోన్ గా చేసుకొని వన్య మృగాలు సంతరిస్తున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటవీ గ్రామ ప్రజలు అడవుల్లోకి వెళ్ళొద్దని, పత్తి రైతులు శబ్దాలు చేసుకుంటూ పనులు చేసుకోవాలని, వన్య మృగాల ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని గ్రామాలలో అటవీ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా గత వారం రోజులుగా కాసిపేట అటవీ ప్రాంతాల్లో జంట పులుల సంచారం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.