calender_icon.png 22 November, 2024 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంట జలాశయాల డ్రా ఫోకస్

22-11-2024 12:19:18 AM

  1. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణకు స్పెషల్ సాఫ్ట్‌వేర్
  2. జాతీయ రిమోటింగ్ సెన్సింగ్ ద్వారా హద్దుల గుర్తింపు

రంగారెడ్డి, నవంబర్ 21(విజయక్రాంతి): జంటజలశయాలపై హైడ్రా దృష్టిసారించింది. జంట జలాశయాల సమీపంలో ఆక్రమణలు భారీగా పెరిగాయని ఇటీవల హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కాగా ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా ముందుకెళ్తే ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల మ్యాప్‌లపై ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి.

జలా శయాల పరిధిలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించకుండా ఆక్రమణల పేరిట ఎలా తొలగిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీంతో హైడ్రా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణ పనిలో పడింది. జాతీయ రిమోటింగ్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ఆధారంగా సర్వే నిర్వహించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు.

2010 నుంచి 2024 మధ్య కాలంలో జంటజలాశయాల వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రత్యేక మ్యాప్‌ల ద్వారా సర్వే చేపట్టాలని భావిస్తున్నారు. మొదలు హిమాయత్‌సాగర్ వద్ద ప్రస్తుత స్థితిగతులపై అధ్యయనం చేయనున్నారు. వాటి ఆధారంగా భవిష్యత్తులో ఎక్కడా ఇబ్బందులు తల్లెత్తకుండా హద్దులను పకడ్బందీగా గుర్తించేందుకు చర్యలు తీసుకోను న్నారు.

హిమాయత్‌సాగర్‌కు సంబంధించిన సర్వే పూర్తి చేసిన అనంతరం ఉస్మాన్‌సాగర్ సర్వేపై దృష్టి సారించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటల పరిరక్షణపై హైడ్రాకు పూర్తిస్థాయి అధికారం అప్పగించింది. భవిష్యత్తు తరాలకు నీటివనరుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే హైడ్రా తమ చర్యలకు నడుం బిగించింది.

భారీగా ఆక్రమణలు..

జంటజలాశయాల సమీపంలో గడిచిన పదేళ్లుగా వెయ్యికి పైగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించి వాటి వివరాలను గుర్తించారు. రాజకీయ, అధికారుల అండదండలతో జలాశయాలను ఆక్రమించిన ఆక్రమణదారులు భారీగా విల్లాలు, ఫామ్‌హౌజ్‌లు, ఇండిపెండెంట్ ఇండ్లు, వ్యాపార సముదాయాలు నిర్మించారు.

వీటిని గుర్తించిన ప్రజలు, స్వచ్చంధ సంస్థలు జంటజలశయాలను రక్షించాలని, ఆక్రమణలను తొలగించాలని హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. దీంతో గత రెండు నెలల వ్యవధిలో హైడ్రా నోటీసులు జారీచేసి ఆక్రమణలు కూల్చింది. దీంతో హైడ్రా చర్యలను అధికార పార్టీ నేతలు సమర్థించగా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. పలువురు ఆక్రమణదారులు హైడ్రా చర్యలపై కోర్టులను ఆశ్రయించారు.

ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించకుండా కూల్చివేతలు చేపట్టడంతో తాము ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని వారు ఆవేదన వెలుబుచ్చారు. వీటిని దృష్టిలో పెట్టుకొని హైడ్రా సాంకేతికతను అందిపుచ్చుకొని భవిష్యత్తు కార్యచరణపై దృష్టిసారించింది. హైడ్రా పరిధిలో ప్రస్తుతం 549 చెరువులు ఉన్నాయి.

ఇందులో 138 చెరువులకు మొదటి విడతగా సర్వే చేపట్టి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లను పూర్తి చేసి హద్దులు వేస్తారు. ఔటర్ సమీపంలో ఉన్న చెరువులు, కుంటలను కూడా హైడ్రా అధికారులు పర్యటించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ప్రతీ చెరువుకు జియో ట్యాంగింగ్ చేసేలా హైడ్రా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.