calender_icon.png 15 January, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోత మోగించారు.. భారత్ ఖాతాలో 22 పతకాలు

05-09-2024 12:01:13 AM

  1. టోక్యో పారాలింపిక్స్ రికార్డు బద్దలు 
  2. షాట్‌పుట్‌లో సచిన్‌కు రజతం 
  3. హైజంప్, జావెలిన్ త్రోలో పతకాల పంట

పారిస్: పారాలింపిక్స్‌లో మొన్న బ్యాడ్మింటన్‌లో షట్లర్లు పతకాల పంట పండించగా.. ఈసారి ఆ బాధ్యతను అథ్లెట్లు తీసుకున్నారు. మంగళవారం అర్థరాత్రి దాటాకా అథ్లెటిక్స్ విభాగంలో నాలుగు పతకాలు రాగా.. బుధవారం మరో పతకం వచ్చి చేరింది. పురు షుల షాట్‌పుట్ ఎఫ్ 46 ఈవెంట్‌లో ప్రపం చ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత అథ్లెట్ సచిన్ సర్జేరావు కిలారి రజతంతో మెరిశాడు. బుధవారం జరిగిన షాట్ పుట్ ఫైనల్లో సచిన్ 16.32 మీటర్లు విసిరి తొలిసారి రజతంతో మెరిశాడు.

ఇక కెనడా అథ్లెట్ గ్రెగ్ స్టివార్ట్ (16.38 మీటర్లు), క్రొయేషియా అథ్లెట్ లుకా బకోవిక్ (16.27 మీటర్లు) స్వర్ణ, కాంస్యాలు దక్కించుకున్నారు. ఇక మంగళవారం అర్థరాత్రి దాటాకా పురుషుల హైజంప్ టీ 63 ఫైనల్లో భారత అథ్లెట్లు శరద్ కుమార్ (1.88 మీటర్లు), తంగవేలు (1.85 మీటర్లు) దూకి వరుసగా రజత, కాంస్యాలు సాధించారు.

పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ 46లో అజీత్ సింగ్ 65.62 మీటర్లు విసిరి రజతం సాధించగా.. సుందర్ సింగ్ గుర్జర్ జావెలిన్‌ను 64.96 మీటర్ల దూరం విసిరి కాంస్యం గెలుచుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలో 22 పతకాలు వచ్చి చేరగా.. ఇందులో 4 స్వర్ణా లు, 8 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం టోక్యో వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో భారత్ 19 పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రికార్డు కనుమరుగయింది.

తన రికార్డు తానే బద్దలు కొట్టి..

పారాలింపిక్స్‌లో షాట్‌పుట్‌లో రజతం సాధించిన సచిన్ కిలారి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఎఫ్ 46 షాట్‌పుట్ ఈవెం ట్ ఫైనల్లో సచిన్ తన రెండో ప్రయత్నంలో గుండును 16.32 మీటర్లు విసిరి ఈ ఏడాది వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నెలకొల్పిన రికార్డును సవరించాడు. కోబే వేదికగా జరిగిన ఆ ఈవెంట్‌లో సచిన్ గుండును 16.30 మీ విసిరి స్వర్ణం గెలిచా డు. తాజాగా పారాలింపిక్స్‌లో కొత్త రికార్డు తో రజతం కైవసం చేసుకొన్నాడు. అంతకముం దు పారా ఆసియా గేమ్స్‌లోనూ సచిన్ పసిడి పతకం నెగ్గిన సంగతి తెలిసిందే.

శరద్, తంగవేలు అదుర్స్..

పారాలింపిక్స్‌లో ఎప్పుడు పతకాలు వచ్చే హైజంప్‌లో ఈసారి కూడా అథ్లెట్లు మెరిశారు. మంగళవారం జరిగిన పురుషుల హై జంప్ టీ63 ఫైనల్ ఈవెంట్‌లో శరద్ కుమార్ (1.88 మీటర్లు), తంగవేలు మరియప్పన్ (1.85 మీటర్లు) రజత, కాంస్యాలతో మెరిశారు. అమెరికా అథ్లెట్ ఫ్రెచ్ ఎజ్రా (1.94 మీ) స్వర్ణం దక్కించుకున్నాడు.  భారత్‌కు చెందిన మరో పారా అథ్లెట్ శైలేశ్ కుమార్ 1.85 మీటర్ల పర్సనల్ బెస్ట్‌తో నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే తంగవేలు మెరుగైన ప్రదర్శన కారణంగా శైలేశ్ తృటిలో పతకాన్ని కోల్పోయాడు. 

ఈ నేపథ్యంలో తంగవేలు అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ63 హైజంప్‌లో వరుసగా మూడు పారాలింపిక్ పతకాలు (2016లో స్వర్ణం, 2020లో రజతం, 2024లో కాంస్యం) సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు. తమిళనాడు సేలం జిల్లాలో పుట్టిన తంగవేలు జీవిత చరిత్ర చదివితే ఎవరికైనా సరే కంట్లో నీళ్లు తిరుగు తాయి. ఐదు సంవత్సరాల వయసులో ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కాళ్లు కోల్పోయిన తంగవేలు అనేక కష్టాలు పడ్డాడు.

తన కుటుంబాన్ని పోషించేందుకు భవన నిర్మాణ కూలీగా కూడా పని చేశాడు. ఇక బీహార్‌లో జన్మించిన శరత్ కుమార్ పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందాడు. 2010లో జరిగిన ఆసియా పారా క్రీడల్లో శరత్ కుమార్ తన అంతర్జాతీయ జర్నీని స్టార్ట్ చేశాడు.

అజీత్‌కు రజతం.. గుర్జర్‌కు కాంస్యం

జావెలిన్ త్రోలో ఎఫ్ 64 విభాగంలో సుమిత్ అంటిల్ స్వర్ణం సాధించగా.. ఎఫ్ 46 విభాగంలో అజీత్, గుర్జర్‌లు రజత, కాంస్యాలతో ఈవెంట్‌ను పరిపూర్ణం చేశారు. కాగా టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్నప్పటికీ అజీత్ సింగ్ పతకం సాధించడంలో విఫలమయ్యాడు. కానీ పారిస్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన కనబరిచి రజతం ఒడిసిపట్టాడు. పారాలింపిక్స్‌లో అజీత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. 2017లో అజీత్ సింగ్ తన స్నేహితుడిని కాపాడబోయి రైలు ప్రమాదంలో ఎడమ చేతిని పోగొట్టుకున్నాడు  నాలుగు నెలల బెడ్ రెస్ట్ తీసుకున్న అజీత్ 2018లో పారా అథ్లెటిక్స్ సీనియర్ చాంపియన్‌షిప్ పోటీ ల్లో బరిలోకి దిగాడు.

2019 బీజింగ్ ప్రపంచ పారా గ్రాండ్ ప్రిక్స్‌లో తొలిసారి స్వర్ణంతో మెరిసిన అజీత్ ఆ తర్వాత 2019, 2023 ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, కాంస్యాలు దక్కించుకున్నాడు. 2022 పారా ఆసియా గేమ్స్‌లో కాంస్యంతో మెరిశాడు. ఇక టోక్యో పారాలింపిక్స్‌లో కాంస్యం సాధించిన గుర్జర్ పారిస్‌లోనూ తన పతకాన్ని నిలబెట్టుకు న్నాడు. రాజస్థాన్‌కు చెందిన గుర్జర్ రియో పారాలింపిక్స్‌లో పతకం సాధించడంలో విఫలమైనప్పటికీ తన ప్రదర్శ నతో ఆకట్టుకున్నాడు. మల్టీ టాలెంటెడ్ అయిన గుర్జర్ జావెలిన్ త్రోతో పాటు షాట్ పుట్, డిస్కస్ త్రోలోనూ పతకాలు సాధించడం విశేషం. 2022 పారా ఆసియా గేమ్స్‌లో గుర్జర్ స్వర్ణంతో మెరిశాడు. 

ప్రతిష్ఠాత్మక పారాలింపిక్స్‌లో మంగళవారం భారత అథ్లెట్లు మరోసారి పతకాల మోత మోగించారు. ఆరో రోజు దీప్తి జీవాంజి కాంస్యంతోనే సరిపెట్టుకోవాలా అన్న తరుణంలో ఆలస్యమైనా అథ్లెటిక్స్‌లో మన అథ్లెట్లు పతకాల పంట పండించారు. తొలుత హైజంప్‌లో శరద్ కుమార్ రజతంతో మెరిస్తే.. తంగవేలు మరియప్పన్ కాంస్యంతో మెరిశాడు. ఆ తర్వాత జావెలిన్ త్రోలో సుమిత్ అంటిల్ రికార్డు స్వర్ణం మరువక ముందే అజీత్ సింగ్, గుర్జార్‌లు రజత, కాంస్యాలను ఒడిసిపట్టారు.

ఇక ఏడో రోజు షాట్‌పుట్‌లో సచిన్ రజతం, ఆర్చరీలో స్వర్ణంతో భారత్ ఖాతాలో 22 పతకాలు వచ్చి చేరాయి. దీంతో టోక్యోలో సాధించిన 19 పతకాల రికార్డు బద్దలు కొట్టిన మన అథ్లెట్లు 25 పతకాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మరో నాలుగు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో దేశం ఒడిలో మరిన్ని పతకాలు చేరడం ఖాయంగా కనిపిస్తోంది..