రూ.14 కోట్లతో వర్షపునీటి కాల్వల నిర్మాణాలు
అన్ని వార్డుల్లోనూ డ్రైన్లు, సిమెంటు రోడ్లు
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడి
జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటి పరిధిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వం రూ.22.94 కోట్లను మంజూరు చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ అర్బన్ ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ నిధులను మంజూరు చేయించామని గురువారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. జడ్చర్ల మున్సిపాలిటిలో అభివృద్ధికి అత్యవసరమైన పనులకు నిధులు కావాలని తాను రూ. 22.94 కోట్ల కు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించగా ప్రభుత్వం వాటిని యధాతథంగా మంజూరు చేసిందని అనిరుధ్ రెడ్డి వివరించారు.
జడ్చర్లలో వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు ప్రవహించడానికి అనువైన డ్రైనేజీ వ్యవస్థలేని కారణంగా వర్షపునీరంతా రోడ్లపై నిలబడిపోయే పరిస్థితి ఉందని ప్రస్తుతం మంజూరైన ఈ నిధులలో రూ.14 కోట్లతో వర్షపు నీరు ప్రవహించే డ్రైన్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దేవీ థియేటర్ నుంచి కిష్టారెడ్డి లాండ్ వరకూ, వీరశివాజీ నగర్ నుంచి లారీ అసోసియేషన్, వ్యాపార సంగం నుంచి వీరశివాజీ నగర్, ఖబరస్థాన్ నుంచి వంశీ హాస్పిటల్, వంశీ హాస్పిటల్ నుంచి ఖలీల్ ఆటో ఎలక్ట్రికల్స్ వరకూ ఈ డ్రైన్లు నిర్మిస్తామన్నారు. అలాగే పోచమ్మగుడి చెరువు నుంచి పాత బస్టాండ్ రోడ్డు, ఓల్డ్ బస్టాండ్ రోడ్డు నుంచి గౌడ ఫంక్షన్ హాల్, లక్ష్మీనగర్ కాలనీ నుంచి శ్రీనివాసనగర్, చర్చ్ నుంచి ఊర చెరువు, కావేరమ్మపేట సర్వీస్ రోడ్ నుంచి ఊరచెరువు వరకూ కూడా వర్షపు నీరు ప్రవహించే పెద్ద డ్రైన్లను నిర్మించడం జరుగుతుందని చెప్పారు.
డ్రైన్ల నిర్మాణం పూర్తయితే జడ్చర్ల పట్టణంలో వర్షపునీరు రోడ్లపై నిలబడి ప్రజలు ఇబ్బందులు పడే దుస్థితి ఉండదన్నారు. మున్సిపల్ వార్డుల పరిధిలో మురికినీటి కాల్వలు, సిమెంటు రోడ్లను రూ. 7.44 కోట్లతో నిర్మిస్తామని వివరించారు. అలాగే అసంపూర్తిగా ఉన్న జడ్చర్ల మున్సిపాలిటి భవన నిర్మాణాన్ని రూ.1.50 కోట్లతో పూర్తి చేస్తామని తెలిపారు. జడ్చర్ల పట్టణాభివృద్ధికి నిధులను మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యుటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు అనిరుధ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.