calender_icon.png 14 November, 2024 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరసనలతో 23 మంది మృతి

10-09-2024 03:47:44 AM

  1. సుప్రీంకోర్టుకు బెంగాల్ ప్రభుత్వం నివేదిక 
  2. వైద్యులు విధుల్లోకి చేరాలని కోర్టు సూచన 
  3. మరో నివేదిక సమర్పించాలని సీబీఐకి నిర్దేశం 
  4. అసహజ మరణంపై క్లారిటీ ఇవ్వండి 
  5. వైద్యురాలి డెత్ సర్టిఫికెట్‌పై సుప్రీం ఆదేశం 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనను సుమోటోగా స్వీకరించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనం సోమవారం మళ్లీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బెంగాల్ ఆరోగ్యశాఖ నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో వైద్యు ల నిరసనల కారణంగా ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోయారని కోర్టుకు తెలిపింది.

కాగా, శాంతియుత నిరసనల్లో పాల్గొన్న వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు వైద్యులు విధుల్లో చేరాలని సూచించింది. డాక్టర్ల భద్రతకు హామీనిస్తూనే.. ఒకవేళ వైద్యులు అప్పటివరకు విధుల్లోకి రాకపోతే వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పింది. ఈ సందర్భంగా వైద్యుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

అసహజ మరణమంటే ఏంటి?

విచారణ సందర్భంగా కేసు దర్యాప్తుపై కొత్త గా మరో నివేదిక సమర్పించాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. సీబీఐ తరఫు వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్  తుషార్ మెహతా.. ఘటన జరిగాక బెంగాల్‌లో ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారని,  వాటిని ఢిల్లీ ఎయిమ్స్‌కు పంపాలని సీబీఐ నిర్ణయించినట్లు కోర్టుకు తెలిపారు. కోర్టు స్పందిస్తూ కొత్త నివేదిక ఇచ్చేవరకు మంగళవారానికి కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ విషయంలో బెంగాల్ ప్రభుత్వం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం 1.47 గంటలకు డెత్ సర్టిఫికెట్ ఇచ్చారని, ఆ తర్వాత 2.55 గంటలకు అసహజ మరణంగా కేసు నమోదైందని చెప్పా రు. దీంతో అసహజ మరణం అంటే ఏంటి? దానిపై సీజేఐ స్పష్టత కోరారు. ఘటన సమయంలో సీసీటీవీ ఫుటేజీని సీబీఐకి ఇచ్చారా? అని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

బాధితురాలి చిత్రాలు తొలగించాలి

సోషల్ మీడియా వేదికల్లో మృతురాలి దృశ్యాలను వెంటనే తొలగించాలని ధర్మాసనం ఆదేశించింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వద్ద సుప్రీం ఆదేశాలతో రక్షణ కల్పిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌కు బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని, మహిళా సిబ్బందికి సైతం కనీస సదుపాయాలు కల్పించడంలేదని కేంద్రం ఆరోపించిం ది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఈ సమస్యను బెంగాల్ ప్రభుత్వం, సీఐఎస్‌ఎఫ్ వెంటనే పరిష్కరించుకోవాలని సూచించింది. సోమవారం రాత్రిలోగా వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.   

వారికి అండగా ఉంటాం

బాధితురాలికి కుటుంబానికి లంచం ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. తమ ప్రభుత్వంపై నిందలు వేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓ నిండు జీవితాన్ని డబ్బు ఎప్పటికీ భర్తీ చేయలేదని, బాధితురాలి కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు చెప్పా రు. ఇదంతా బీజేపీ కుట్ర అని, ఇందుకు వామపక్ష పార్టీలు సైతం సహకరిస్తున్నాయని మండిపడ్డారు. నిరసనల్లో పాల్గొన్న వైద్యురాలి తండ్రి మాట్లాడిన వీడియో వైరల్‌గా మారడంతో మమత ఈ మేరకు స్పందించారు.