19-02-2025 12:06:29 AM
మెదక్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణలో పలు మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి, పూర్వ పద్దతిలో మార్కుల విధానాన్ని అమలులోకి తెచ్చింది. అడిషనల్ అవసరం లేకుండా 24 పేజీల బుక్లెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాకు సరిపడా బుక్లెట్లు చేరుకున్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వచ్చేనెల 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 30వేల పైచిలుకు విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. పరీక్షా సమయంలో విద్యార్థులకు ప్రశ్నాపత్రంతో పాటు ఓఎంఆర్ షీట్, జవాబులు రాసేందుకు నాలుగు పేజీలు ఇవ్వడం చేసేవారు. కానీ అడిషనల్ షీట్లు అడగాల్సిన అవసరం లేకుండా ఈసారి 24 పేజీలతో బుక్లెట్ ను తీసుకువస్తున్నారు. అన్ని జవాబులు బుక్లెట్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.
అన్ని మండలాల్లో రిసీవింగ్ సెంటర్లు...
జిల్లాకు 24 పేజీలతో కూడిన బుక్లెట్లు ఇప్పటికే చేరుకున్నాయి. వాటిని భద్రపరిచేందుకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో స్టేషనరీ రిసీవింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఈ సెంటర్ల నుంచి పరీక్షా కేంద్రాలకు బుక్లెట్లను తీసుకువెళ్ళనున్నారు.
ఇబ్బందులు తొలగుతాయి...
పదో తరగతి వార్షిక పరీక్షల కోసం విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. ఈసారి విద్యార్థులు జవాబులు రాసేందుకు బుక్లెట్లను ఇవ్వనున్నాం. దీని ద్వారా తరచూ అడిషనల్ షీట్లు అడగాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అడిషనల్ షీట్లు అవసరం పడితే అందిస్తాం.
రాధాకిషన్, జిల్లా విద్యాధికారి, మెదక్