27-03-2025 12:12:34 AM
దర్జాగా భవన నిర్మాణ పనులు చుట్టూ రేకులు వేసి
రాత్రివేళల్లో డ్రిల్లింగ్ పట్టింపులేని ఎండోమెంట్ శాఖ అధికారులు
భూమి అన్యాక్రాంతం అయినా చలనం లేని దుస్థితి పైగా అక్రమార్కులకు సహకారం
రాజేంద్రనగర్, మార్చి 26 (విజయక్రాంతి): దేవాదాయ శాఖ భూములకు రక్షణ లేకుండా పోయింది. ఎక్కడ భూము లు కనిపించినా గద్దల్లా వాలిపోయి ఆక్రమించుకుంటున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అక్రమార్కులు అడ్డు అదుపు లేకుండా మింగేస్తున్నారు. వివిధ శాఖల అధికారులకు ముడుపుల మూటలు ముట్ట చెపుతూ పనులు కానిస్తున్నారు. తాజాగా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపురి కాలనీ రోడ్ నెంబర్ 16 లో గణేష్ ( తుల్జా రామ్ బాగ్ ) ఆలయానికి సంబంధించి సర్వేనెంబర్ 125, 116, 112 లో 800 గజాల స్థలం ఉంది. దీని విలువ సుమారు 12 కోట్లు. అయితే 117 సర్వే నంబర్ లో భూమి ఉన్న కొందరు తప్పుడు సర్వే నంబర్లతో పత్రాలు సృష్టించి దేవాదాయ శాఖకు చెందిన 800 గజాల స్థలాన్ని దర్జాగా కబ్జా చేశారు. దీనికి వివిధ శాఖల అధికారులు కూడా తమవంతు సహకరించారు. తప్పుడు పత్రాలతో కోర్టులో కొన్ని రోజులు అక్రమార్కులు స్టే కూడా తెచ్చుకున్నారు. ఇలా ఉండగా భూమిని కబ్జా చేసిన వ్యక్తి స్థలం చుట్టూ నలువైపులా షీట్స్ వే యించి రాత్రి సమయాల్లో నిబంధనలకు విరుద్ధంగా డ్రిల్లింగ్ కూడా చేస్తున్నట్లు స్థానికులు ఆగ్రహం చేస్తున్నారు.
పోలీస్ స్టేషన్లో కేసు..
దేవాదాయ శాఖ భూమికి సంబంధించి అధికారులు ఫిర్యాదు చేయడంతో కొన్ని రో జుల క్రితం నార్సింగి పోలీస్ స్టేషన్లో అక్రమార్కులపై కేసు కూడా నమోదు చేయించినట్లు ఎండోమెంట్ ఈవో అరుణకుమారి వెల్లడించారు. నిర్మాణ పనులు చేయొద్దని కోర్టు నుంచి ఆదేశాలు ఉన్నా కూడా అక్రమార్కులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యథేచ్చగా పనులు కొనసాగిస్తున్నారు.
అక్రమార్కులకు అధికారుల అండ
సుమారు 12 కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసిన అక్రమార్కులకు ఎండోమెంట్ శాఖ అధికారులు అన్నివిధాలుగా సహకరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయ శాఖకు చెందిన ఉన్నతాధికారు లు సూపరింటెండెంట్ మోహన్ రావు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి, ఈవో అరు ణకుమారి తదితరులు కొన్ని ఎండోమెంట్ భూమి వద్దకు చేరుకొని పనులు నిలిపివేయించారు. ఎండోమెంట్ శాఖకు చెందిన 800 గజాల స్థలాన్ని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ దిశగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.12 కోట్లు విలువచేసే ఎండో మెంట్ శాక స్థలాన్ని కబ్జా చేసిన అక్రమార్కులు తప్పుడు సర్వే నెంబరు సృష్టించి మణికొండ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ భా గం నుంచి నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. ఈ విషయంలో ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి కోట్లు విలువ చేసే స్థలాన్ని స్వాధీనం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు చెబుతున్నారు.
లెటర్ ఇస్తే పర్మిషన్ క్యాన్సల్
మల్కాపూర్ లోని ఎండోమెంట్ స్థలానికి సంబంధించి ఆ శాఖ అధికారులు మా కు లెటర్ ఇస్తే గతంలో ఇచ్చిన కన్స్ట్రక్షన్ పర్మిషన్ ను పూర్తిగా రద్దు చేస్తాం. కానీ మాకు ఎండోమెంట్ అధికారులు ఇప్పటివరకు లెటర్ ఇవ్వలేదు.
సంతోష్ సింగ్, మణికొండ టౌన్ ప్లానింగ్ అధికారి