calender_icon.png 25 April, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రోలో మహిళల భద్రత కోసం ట్యూటెమ్ యాప్

25-04-2025 12:06:27 AM

  1. చివరి గమ్యస్థానం వరకు సురక్షిత ప్రయాణం
  2. మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : హైదరాబాద్ మెట్రోలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం అధునాతన సాంకేతికతతో ‘ట్యూటెమ్’ (టెక్నాల జీస్ ఫర్ అర్భన్ ట్రాన్సిట్ టు ఎన్హాన్స్ మొబిలిటీ అండ్ సేఫ్ యాక్సెసిబిలిటీ)అనే యాప్‌ను త్వరలో అందుబాటులోకి రాబోతోందని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. చివరి గమ్యస్థానం వరకు సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

బిట్స్‌పిలానీ హైదరాబాద్ క్యాం పస్‌లో జరిగిన యూజర్ వర్క్‌షాప్‌కు ఎన్వీఎస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో రైల్, హైదరాబాద్ పోలీసుల సహకారంతో బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ బొంబాయి సంయుక్తంగా ఏడీబీ ఆర్థిక సహాయంతో ట్యూటెమ్ యాప్‌ను అభివృద్ధి చేశారన్నారు. 

ఈ యాప్‌లో డ్రైవర్, యూజర్ అని రెండు విభాగాలుంటాయన్నారు. మెట్రోతో పాటు బస్సు, బైక్, ఆటో, కాలినడకన గమ్యస్థానానికి వెళ్లడాన్ని ఈ యాప్ కవర్ చేస్తుందని తెలిపారు. ఎక్కడైనా మహిళా ప్రయాణికులకు ఇబ్బంది కలిగితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూం, వారి ఇంటివారిని, బంధువులను అప్రమత్తం చేసే సౌకర్యం ఈ యాప్‌లో ఉంటుందన్నారు. మెట్రో ప్రయాణికులకు సురక్షితమైన రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

మహిళలు అర్ధరాత్రి వేళ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరేలా ట్యూటెమ్ యాప్‌లో పలు సౌకర్యాలు పొందుపర్చామని బిట్స్ ఫిలానీ వీసీ ప్రొ.వి.రామ్‌గోపాల్‌రావు తెలిపారు. కార్యక్రమంలో ఏడీబీ ప్రతినిథి జోసెఫిన్ ఎక్వినో, బిట్స్ ఫిలానీ క్యాంపస్ డైరెక్టర్ ప్రొ.సౌమ్యోముఖర్జీ, ఐఐటీ బొంబాయి ప్రొ.అవిజిత్, బిట్స్ ఫిలానీ ప్రొ.ప్రశాంత్‌సాహూ తదితరులు పాల్గొన్నారు.