- ఆంక్షలతో సగం మందికి రైతుభరోసా ఎగనామం
- కాంగ్రెస్ సర్కారు ఎత్తుగడలను తిప్పికొట్టండి
- ప్రతి ఎకరానికి పెట్టుబడి ఇవ్వాల్సిందేనని నిలదీయండి
- అసెంబ్లీలో ఏమీ చెప్పకుండా తప్పించుకున్న రేవంత్‌రెడ్డి
- రైతులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు ఎగనామం పెట్టేందుకు కుట్ర లు చేస్తుందని, అన్నదాతలు తిరుగుబాటు చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పిలుపునిచ్చారు. ఆదివారం రాష్ట్ర రైతాంగానికి ఆయన బహిరంగ లేఖ రాశారు.
శాసనసభలో రైతు భరోసా మీద చర్చ పెట్టి ఎటూ తేల్చకుం డా సంబంధంలేని అంశాలను చర్చకు తీసుకొచ్చి అసలు సంగతిని అతి తెలివితో సీఎం రేవంత్‌రెడ్డి పక్కదారి పట్టిం చారని విమర్శించారు. భరోసా పథకంపైన ఆంక్షలు, అనుమానాలు, సందేహా లకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం దాటవేసిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుబంధు పథకంపై పచ్చి అబద్ధాలతో కూడిన దుష్ర్పచారాన్ని, దాడిని చేశార ని.. అన్నంపెట్టే రైతును దొంగ లా చిత్రించే దుర్మార్గానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరును చూస్తే కోతలు, కొర్రీలు పెట్టి రైతు భరోసాను సగానికి సగం ఎగవేసే ఎత్తుగడతో ఉన్నట్టు అర్థమవుతుందన్నారు.
తిండి పెట్టే రైతుకు తొండి చేసి పైసలు ఎగ్గొట్టే పన్నాగం ప్రారంభమైందని, విధివిధానాలు, మార్గదర్శకాలు ఏమీ సభలో చెప్పకుండా సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తాం అని ఒక మాట చెప్పి సర్కార్ తప్పించుకుందని ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని దాటడం కోసం దొంగ ఉపాయాలతో మమ అనిపించి పెట్టుబడి సాయానికి ఘోరీ కట్టే ఘో రాలు చేయబోతున్నారని విమర్శించారు. అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు మేల్కోకపోతే భరోసా ఉండదని, గోస మాత్రమే మిగులుతుందని హెచ్చరించారు.
పీఎం కిసాన్ మార్గదర్శకాల అమలుకు యత్నాలు
కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుతంత్రం కూడా చేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ మార్గదర్శకాలనే రైతుభరోసాకు కూడా వర్తింపజేసేందుకు యత్నిస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. అదే జరిగితే రాష్ర్టంలో సగం మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందబోదని అన్నారు.
బడేభాయ్ బాటలోనే చోటే భాయ్ నడుస్తున్నాడని, రైతు భరోసా విషయంలో కూడా ఆ తోవలోనే పోతే 40 లక్షల మంది పైగా అన్నదాతలకు మొండిచెయ్యే గతవుతుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి.. మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలని మయాదారి ముచ్చట్లు చెప్పాడని, ఇప్పుడు రెండో పంటకు ఇచ్చిన రైతుబంధుపై తప్పుడు ప్రచారం చేసి కర్షకులను కించ పర్చేలా మాట్లాడుతున్నడని మండిపడ్డారు.
ఖజానాలో సొమ్మంతా రైతు కొల్లగొట్టినట్టు ప్రచారం చేయడం సమంజసం కాదని, ఐదెకరాల లోపే ఇస్తామని, సర్వేలు చేసి డబ్బులు వేస్తామని అన్నం పెట్టే రైతు మీద ఆంక్షలు పెట్టడం అనుమానించడమేనని అన్నారు. పంట పెట్టుబడి రైతు హక్కు.. భిక్ష కాదని స్పష్టంచేశారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు 22 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి పైసలు గ్యారెంటీ ఇస్తామని రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశాడని గుర్తుచేశారు.
ఇప్పుడు వారంతా కళ్లల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తున్నారని చెప్పారు. చైతన్యవంతమైన తెలంగాణ రైతులు కాంగ్రె స్ సర్కారు ఎత్తులను, నక్కజిత్తులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో కాం గ్రెస్ నాయకులకు గల్లా పట్టి నిలదీయాలని, ఎన్నికల్లో చెప్పిన మాటలేంటి.. ఇప్పుడు చే స్తున్న మాయలేంటని మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రశ్నించాలని సూచించారు.
రైతురంది తీర్చిన కేసీఆర్
రైతుకు రంది లేకుండా రెండు పంటలకు పెట్టుబడి సాయం అందించేందుకు కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం వ్యవసాయాన్ని పండుగలా మార్చడంలో కీలక పాత్ర పోషించిందని కేటీఆర్ స్పష్టంచేశారు. 11 సీజన్లలో రూ.73 వేల కోట్లు కర్షకుల ఖాతాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం జమ చేసిందని స్పష్టంచేశారు.
అవినీతికి, లీకేజీలకు తావులేని అతిపెద్ద నగదు బదిలీ పథకం రైతుబంధు ఒకటేనని వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగానైనా అధికారంలోకి రావాలని రైతులకు కాంగ్రెస్ ఇష్టానుసారంగా హామీలను గుప్పించిందని.. ఎకరానికి రైతుభరోసా రూ.15 వేలు ఇస్తామని వాగ్దానం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ పథకానికి ఎగనామం పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికి ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి రేవంత్ సర్కార్ బాకీ రూ.17,500 పడిందన్నారు. ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరి రైతులకు ఇస్తారా? లేదా? అని అసెంబ్లీలో ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదని అన్నారు. రాళ్లూ రప్పలకు ఇచ్చి రైతుబంధు దుర్వినియోగం చేశారని అడ్డగోలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాదించారని మండిపడ్డారు.