* ప్రపంచ ఖ్యాతిగాంచనున్న ఉత్తర తెలంగాణ
నిజామాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): సుగంధ ద్రవ్యాల బోర్డు పరిధిలో ఉన్న పసుపు పంటను విడదీసి ప్రత్యేకంగా పసుపు బోర్డును ఏర్పాటు చేసి, నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన పసుపు పంట నిజామాబాద్ జిల్లాలో అధిక మొత్తంలో సాగు అవుతుంది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు పంటకు సంబంధించిన రీసెర్చ్ సెంటర్లు, పసుపు శుద్ధి కర్మాగారాలు, ప్రైవేటు స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పడే అవకాశం ఉంది.
కర్క్యూమిన్ యూనిట్లు శుద్ధి కర్మాగారాలు కర్క్యుమెంట్ ఆయిల్ కర్మాగారాలు, ఎగుమతి కేంద్రాలు ఏర్పడనున్నాయి. పరిశ్రమలు కూడా స్థాపించబడి స్థానికులకు ఉపాధి అవకాశాలు అందనున్నాయి. జిల్లాలో గతంలో ఇండస్ట్రియల్ స్టేజ్‌గా ఏర్పాటు చేసిన ప్రాంతంలో పసుపు పంట సంబంధిత పరిశ్రమలు ఏర్పడితే ప్రపంచ దేశాల్లోనే ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆణిముత్యం కానుంది.
రూ.8,400 కోట్లకు ఎగుమతులు?
ప్రపంచస్థాయిలో డిమాండ్ ఉన్న పసుపు పంట ఏటా రూ.1,600 కోట్ల ఎగుమతులు దేశ, విదేశాలకు జరుగుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో భారతదేశం 62 శాతం వాటాను సాధించింది. అయితే ఎగుమతులు రూ.8,400 కోట్లకు పెంచాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోంది. కాగా బంగ్లాదేశ్, మలేషియా, అమెరికా, యుఏఈ దేశాల్లో భారత పసుపు పంటకి ఉన్న డిమాండ్‌తో పసుపు పంటతో ముడిపడి ఉన్న పరిశ్రమలను భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో స్థాపించడానికి దేశ విదేశాల నుంచి పెట్టుబడులు రానున్నాయి.
పూర్తిస్థాయిలో పసుపుబోర్డు కార్యకలాపాలను ప్రారంభిస్తే పసుపు పంట వంగడాల అభివృద్ధి నుంచి హార్వెస్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్‌తో పాటు రైతులకు అధికంగా లాభం కలగనుంది. చెరుకు పంట మాదిరిగా రైతులు అవసరాన్ని బట్టి బోర్డు విత్తనంతో పాటు ఇతర సహకారం అందించనుంది. బై బ్యాక్ ఒప్పందంతో రైతులకు మేలు జరుగుతుంది.
పసుపును భూమిలో నుంచి తీయడం, ఆరబెట్టడం, ఉడకబెట్టడం, ఎండు పసుపును శుభ్రం చేసి పాలిష్ చేయడంతో పాటు అవసరమైన సామగ్రిని రాయితీలపై అందించే అవకాశం ఉంటుంది. రైతులకు ఎప్పటికప్పుడు కర్యూమిన్ శాతం, నాణ్యత దిగుబడి పెరిగేలా శాస్త్రవేత్తల నుంచి సహకారం లభించనుంది.