04-03-2025 12:52:49 AM
నిజామాబాద్ మార్చ్ 3: (విజయ క్రాంతి) : ఇటీవల జాతీయ పసుపు బోర్డు సెక్రటరీగా నియమించబడ్డ శ్రీమతి భవాని ఐఏఎస్ ఈరోజు నిజామాబాద్ లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆమె పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే జక్రాన్ పల్లి మండలంలోని మనోహరాబాద్ లో గల జేఎంకేపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన పసుపు ఆధారిత పరిశ్రమను బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తో కలిసి సందర్శించారు.
మూడు కోట్ల వ్యయంతో ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 600 కు పైగా రైతులు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం పరిశ్రమలో తయారుచేసిన పసుపు పౌడర్ ని ఆసక్తిగా పరిశీలించారు. ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల పసుపు రైతులకు మేలు కలగడమే గాక, స్థానిక యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించే ఆస్కారం ఉందన్నారు.
అనంతరం కమ్మర్ పల్లి మండల కేంద్రంలో గల పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రం ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను శాస్త్రవేత్త మహేందర్ రెడ్డి వివరించారు. వీరి వెంట స్పుసైస్ బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సుందరేశన్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.