* నెరవేరిన ఇందురువాసుల కల
* ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్రమంత్రి పీయూష్
* ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ అర్వింద్
నిజామాబాద్, జనవరి 15 (విజయక్రాంతి): ఇందూరువాసుల చిరుకాల పసుపు బోర్డు ఆకాంక్ష నెరవేరింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కలిసి మంగళవారం న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా బోర్డును ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిజామాబాద్‌లోని ఓ హోటల్‌లోనూ పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఆధ్వర్యంలో పసుపుబోర్డు ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ పసుపు రైతుల కలను నెరవేర్చినందుకు ప్రధాని మోదీకి ఎంపీ ధర్మపురి అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి పండగ కానుకగా పసుపుబోర్డు ఏర్పాటు చేశారన్నారు.
గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని, రైతుల సంక్షేమానికి బీజేపీ కృషి చేస్తోందని అర్వింద్ అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఎంపీ అర్వింద్‌కు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా రైతులు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేశ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.