calender_icon.png 10 October, 2024 | 5:56 AM

కల్లోల మార్కెట్

04-10-2024 12:15:44 AM

వెన్నాడిన యుద్ధ భయాలు

సెన్సెక్స్ 1,770 పాయింట్లు పతనం

25,300 పాయింట్ల దిగువకు నిఫ్టీ

ముంబై, అక్టోబర్ 3: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ఫలితంగా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఆయిల్, బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లలో అమ్మకాలు వెల్తువెత్తడంతో ప్రధాన స్టాక్ సూచీలు నిలువునా పతనమయ్యాయి. గురువారం ఒక్కరోజులోనే  బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,770 పాయింట్లు క్షీణించి 82,497 పాయింట్ల వద్ద నిలిచింది.

ఇదేబాటలో  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  547 పాయింట్ల భారీ నష్టంతో 25,300 దిగువన 25,250 పాయింట్ల వద్ద నిలిచింది. వరుస మూడు రోజుల్లో సెన్సెక్స్ 3,300 పాయింట్లు, నిఫ్టీ 960 పాయింట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ షేర్లలో 29 షేర్లు, నిఫ్టీ 48 షేర్లు క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు కొద్దిరోజులుగా నిధుల్ని వెనక్కు తీసుకోవడం, క్రూడ్ ధరలు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని విశ్లేషకులు తెలిపారు.

ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, దక్షిణ కొరియా సూచీలు తగ్గగా, టోక్యో పాజిటివ్‌గా ముగిసింది. మెయిన్‌ల్యాండ్ చైనా మార్కెట్‌కు సెలవు. యూరప్‌లోని ప్రధాన మార్కెట్లయిన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు క్షీణించాయి. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 1.4 శాతం పెరిగి 75 డాలర్ల వద్దకు చేరింది. 

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఇజ్రాయిల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడంతో ఇజ్రాయిల్ నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉంటుందన్న భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయని వివరించారు.

మరోవైపు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో సెబీ ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలతో మార్కెట్లో ట్రేడింగ్ పరిమాణం భారీగా తగ్గుతుందన్న ఆందోళనలూ మార్కెట్‌ను మరింత పడదోశాయని వివరించారు. ఇటీవల చైనా ప్రవేశపెట్టిన ఆర్థిక ఉద్దీపన నేపథ్యంలో ఆ దేశపు మార్కెట్ చౌకగా పరిగణిస్తూ భారత్ నుంచి విదేశీ ఫండ్స్ నిధుల్ని అక్కడికి మళ్లిస్తున్నాయని చెప్పారు.

భారత్ ఈక్విటీలు అత్యంత ఖరీదైనవికావడంతో ఎఫ్‌పీఐలు, ఎఫ్‌ఐఐలు పెట్టుబడుల్ని భారత్ నుంచి చైనాకు తరలిస్తున్నారని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దేవర్ష్ వకీల్  చెప్పారు. 

రిలయన్స్, ఎల్ అండ్ టీ టాప్ లూజర్స్

సెన్సెక్స్-30 బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సన్ అండ్ టుబ్రోలు 4 శాతం పడిపోయాయి. యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 3 శాతం వరకూ తగ్గాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఒక్కటే లాభంతో ముగిసింది.

అన్ని రంగాల సూచీలూ నష్టాలు పాలయ్యాయి. అధికంగా రియల్టీ ఇండెక్స్ 4.49  శాతం తగ్గింది.  క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 3.18 శాతం, ఆటోమొబైల్స్ ఇండెక్స్ 2.94 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 2.87 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 2.75 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2.52 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 1.84 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.27 శాతం చొప్పున క్షీణించాయి.

రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి

తాజా స్టాక్ మార్కెట్ పతనంతో ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లు రూ.9.78 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.9,78,778 కోట్లు తగ్గి 4,65,07,685 కోట్లకు (5.54 ట్రిలియన్ డాలర్లు) చేరింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితంగా భారత్‌తో సహా పలు వర్థమాన మార్కెట్ల నుంచి నిధుల్ని విదేశీ ఫండ్స్ వెనక్కు తీసుకుంటున్నాయని, క్రమేపీ చైనాలో పెట్టుబడులు పెంచుకుంటున్నాయని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు. 

ఎఫ్‌పీఐలు భారీ విక్రయాలు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు గురువారం ఒక్కరోజులోనే మార్కెట్ నుంచి రూ.15,243 కోట్లు వెనక్కు తీసుకున్నట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత మూడు ట్రేడింగ్ రోజుల్లో విదేశీ ఫం డ్స్ రూ.16,000 కోట్ల మేర నికర విక్రయాలు జరిపాయి.  మొత్తం ఈ నాలు గు రోజుల్లో రూ.30,000 కోట్లకుపైగా విలువైన షేర్లను విక్రయించాయి.